Fake News, Telugu
 

కర్ణాటకలో జరిగిన పాత కిడ్నాప్‌ని ముస్లిములు చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ముస్లిములు పట్టపగలు ఆడపిల్లలను ఎత్తుకుపోతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లిములు కర్ణాటకలో పట్టపగలు ఆడపిల్లలను కిడ్నాప్‌ చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): యువతిని పట్టపగలు కిడ్నాప్ చేసిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో 2020లో జరిగింది. ప్రేయసి తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో శివ శంకర్ అనే ఒక వ్యక్తి తన ప్రియురాలిని ఇలా పట్టపగులు కిడ్నాప్ చేసాడు. ఈ కిడ్నాప్ కోసం శివ శంకర్ స్నేహితులు బాలాజీ మరియు దీపక్ సహాయం చేసారు. ఈ కిడ్నాప్ కేసులోని నిందితులు ముస్లిములు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకితే, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ETV ఆంధ్రప్రదేశ్’ న్యూస్ ఛానల్ ‘14 ఆగష్టు 2020’ నాడు యూట్యూబ్ లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తల్లిదండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ప్రేయసిని ప్రియుడు కిడ్నాప్ చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో జరిగినట్టు అందులో తెలిపారు.

‘13 ఆగష్టు 2020’ నాడు కోలార్ తాలుకాలోని MG రోడ్డు పై ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ‘The News Minute’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. కోలార్ జిల్లా కిలారిపేట గ్రామానికి చెందిన శివశంకర్, తన స్నేహితులు బాలాజీ మరియు దీపక్‌ల సహాయంతో తన ప్రియురాలిని కిడ్నాప్ చేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు. ఆ అమ్మాయిని అపహరించి ఒక లాడ్జ్ లో ఉంచినట్టు, అక్కడి నుంచి ఆ అమ్మాయిని పోలీసులు రక్షించి తన కుటుంబ సభ్యులకి అప్పగించినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ‘ETV Bharat’ న్యూస్ సంస్థ కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

ఈ ఘటనకి సంబంధించి కోలార్ జిల్లా గుల్పేట పోలీస్ స్టెషన్‌లో ఫైల్ అయిన FIRలో, నిందితుల పేర్లు శివశంకర్, బాలాజీ, దీపక్‌ అని పేర్కొని ఉంది. ఈ కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్టు FIRలో తెలిపారు. ఈ కిడ్నాప్ చేసిన నిందితులు ముస్లిములని FIRలో ఎక్కడా పేర్కొనలేదు.

ఇదివరకు, ఈ కిడ్నాప్ ఘటనని వికారాబాద్ మరియు హైదరాబాద్ నగరానికి ముడిపెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్‌ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకున్న పాత కిడ్నాప్‌ని ముస్లిములు చేసినట్టు ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll