Fake News, Telugu
 

పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియోని హిమాచల్ ప్రదేశ్‌లో భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల భారీ వరదలు చోటుచేసుకున్న నేపథ్యంలో, టూరిస్టులు ప్రాణబయంతో స్వస్థలాలకి ప్రయాణించడంతో ఈ ట్రాఫిక్ జామ్ జరిగినట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, పాకిస్తాన్ దేశంలో ఇటీవల చోటుచేసుకున్న భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలని చూపిస్తుంది. ఇద్-ఉల్-అదా పండగ సెలవుల సందర్భంగా వేలాది మంది పాకిస్తాన్‌ టూరిస్టులు మాన్సేహ్ర జిల్లాలోని కఘన్ వ్యాలీలో పర్యటించారు. ఈ క్రమంలో మాన్సేహ్ర-నరాన్-జల్క్హాడ్ రోడ్డు పై వేలాది వాహనాలు గుమిగూడి భారీ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. వీడియోలో కనిపిస్తున్న ట్రాఫిక్ జామ్ హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సీర్ర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పాకిస్తాన్ దేశానికి చెందిన ‘ARY’ న్యూస్ ఛానల్ 26 జూలై 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్ దేశంలోని కఘన్ వ్యాలీ సమీపంలో ఈ భారీ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకున్నట్టు వీడియోలో రిపోర్ట్ చేసారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన పలు న్యూస్ సంస్థలు, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

పాకిస్తాన్‌లో ఇద్-ఉల్-అదా పండగ సెలవుల సందర్భంగా వేలాది మంది టూరిస్టులు మాన్సేహ్ర జిల్లాలోని కఘన్ వ్యాలీలో పర్యటించారు. ఈ క్రమంలో మాన్సేహ్ర-నరాన్-జల్క్హాడ్ రోడ్డు పై భారీ ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. సుమారు 700,000 వాహనాలు ఈ ట్రాఫిక్ జాములో ఇరుక్కపోయినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చదవొచ్చు.

ఈ ట్రాఫిక్ జామ్ హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో,  వీడియోలో కనిపిస్తున్న ట్రాఫిక్ జామ్ దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించినవి కావని స్పష్టం చేస్తూ హిమాచల్ ప్రదేశ్‌ పోలీసులు తమ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు.

చివరగా, పాకిస్తాన్‌కి సంబంధించిన వీడియోని హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న భారీ ట్రాఫిక్ జామ్ దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll