Fake News, Telugu
 

కోలార్ లో జరిగిన కర్ణాటక యువతి కిడ్నాప్ వీడియోని, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ముడి పెడుతున్నారు

0

వికారాబాద్ లో యువతి కిడ్నాప్ అని చెప్తూ ఉన్న ఫోటోతో పాటు దీనికి సంబంధించిన వీడియో లింక్ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి కొందరు ఇదే వీడియోని హైదరాబాద్ లోని ECIL దగ్గర జరిగిన సంఘటనగా ప్రచారం చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించిన వీడియో.

ఫాక్ట్(నిజం): యువతిని పట్టపగలు కిడ్నాప్ చేసిన ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు ఒక ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా పోస్టులో ఉన్న వీడియో వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించింది కాదని చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో గురించి మరింత సమాచారం వెతికే క్రమంలో ఈ వీడియో గురించి వివరణ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వారు తమ ఫేస్ బుక్ ఎకౌంటులో షేర్ చేసిన ఒక పోస్ట్ మాకు కనిపించింది. ఈ పోస్ట్ ద్వారా సోషల్ మీడియా బాగా షేర్ చేస్తున్న పోస్టులోని వీడియో వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించినది కాదు అని వారు తెలిపారు. పైగా వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధించి ఎటువంటి cctv వీడియో అందుబాటులో లేదని కూడా వారు స్పష్టం చేసారు. వికారాబాద్ పోలీస్ వారు తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ద్వారా ఇదే విషయం చెప్పారు. దీన్నిబట్టి పోస్టులో ఉన్న వీడియోకి వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ కి సంబంధం లేదని కచ్చితంగా చెప్పొచ్చు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘ETV ఆంధ్రప్రదేశ్’ న్యూస్ ఛానల్ ‘14 ఆగష్టు 2020’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. తల్లిదండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ప్రేయసిని ప్రియుడు కిడ్నాప్ చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు అందులో తెలిపారు. యువతీ తల్లిదండ్రులు తమ ప్రేమని ఒప్పుకోకపోవడంతో చేసేదేమి లేక తల్లిదండ్రులు చుసిన అబ్బాయిని పెళ్ళిచేసుకోవడానికి ఆ అమ్మాయి అంగీకరించింది. ఈ విషయాన్నీ జీర్ణించుకోలేక ప్రియుడు, తన స్నేహితుల బృందంతో కారులో వచ్చి ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకేళ్ళినట్టు వీడియోలో తెలిపారు.

‘13 ఆగష్టు 2020’ నాడు కోలార్ తాలుకాలోని MG రోడ్డు పై ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ‘Mangalore Today’ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఆ అమ్మాయిని అపహరించి ఒక లాడ్జ్ లో ఉంచినట్టు, అక్కడి నుంచి అమ్మాయిని పోలీసులు రక్షించి తన కుటుంబ సభ్యులకి అప్పగించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి రాసిన మరికోన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇటేవల వికారాబాద్ లో జరిగిన యువతి కిడ్నాప్ నేపధ్యంలో పోస్టులో ఉన్న వీడియోని వికారాబాద్ లో జరిగిన ఘటనకి సంబంధించిందిగా సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ECIL దగ్గర పట్టపగలు ఒక యువతిని కిడ్నాప్ చేసిన వీడియో అని ఇంకొక యూసర్ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేయగా, హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఈ ఘటనకి సంబంధించి స్పష్టతనిస్తూ పెట్టిన ట్వీట్ ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పోస్టులో షేర్ చేసిన యువతి కిడ్నాప్ వీడియో వికారాబాద్ లోనో ECIL లోనో జరిగిన సంఘటన కాదు, కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరణ (OCTOBER 01, 2020):
పోస్టులోని వీడియో మొదట వికారాబాద్ లో జరిగిన ఘటనగా ప్రచారం అవ్వగా, తరువాత ECILలో జరిగినట్టు ప్రచారం జరిగింది. ఆర్టికల్ శీర్షిక మరియు వివరణ దానికి తగినట్టుగా మార్చబడినది.

Share.

About Author

Comments are closed.

scroll