Fake News, Telugu
 

కుల వివక్షను భారత రాజ్యాంగం మరియు శిక్షాస్మృతి నిషేదిస్తున్నాయి; బ్రాహ్మణులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించలేదు

0

‘బ్రాహ్మణ సమాజాన్ని ద్వేషించే మరియు వేధించే వారిపై ఎవరైనా బ్రాహ్మణులు అట్రాసిటీ కేసు నమోదు చేయవచ్చని’ సుప్రీంకోర్టు అన్నట్టు చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘బ్రాహ్మణ సమాజాన్ని ద్వేషించే మరియు వేధించే వారిపై ఎవరైనా బ్రాహ్మణులు అట్రాసిటీ కేసు నమోదు చేయవచ్చు’ : సుప్రీంకోర్టు.

ఫాక్ట్ (నిజం): సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో బ్రాహ్మణులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఐతే కులమత వివక్షకు సంబంధించి భారత రాజ్యాంగం అన్ని కులాలకు, మతాలకు రక్షణ కల్పిస్తుంది, ఇప్పుడు ప్రత్యేకంగా బ్రాహ్మణులకు (లేదా వేరే ఇతర కులానికి) రక్షణ కల్పించేది ఏమీ ఉండదు.  రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులు కులమతాలకు అతీతంగా అందరికి వర్తిస్తాయి. ఇక భారత శిక్షాస్మృతిలోని (IPC) సెక్షన్ 153A, సెక్షన్ 153B, సెక్షన్ 505 (2) మొదలైన సెక్షన్లు కులం ఆధారంగా జరిగే వివక్ష నుండి రక్షిస్తాయి. ఈ ఈ సెక్షన్లు కులాలతో సంబంధం లేకుండా అందరికి వర్తిస్తాయి, బ్రాహ్మణులు కూడా ఈ సెక్షన్ల కింద రక్షణ పొందొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఏదైనా తీర్పులో గానీ లేక వేరే ఇతర సందర్భంలో గానీ బ్రాహ్మణులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగానే ఇలా వ్యాఖ్యానించి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి మీడియా కథనాలేవి లభించలేదు.

భారత రాజ్యంగం కులం మరియు మతాలకి అతీతంగా అందరికి రక్షణ కల్పిస్తుంది. ప్రాధమిక హక్కులు అందరికి సమానంగా వర్తిస్తాయి. ముఖ్యంగా ఆర్టికల్ 15 (మతం, కులం, లింగం, సంతతి లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధించడం) మరియు ఆర్టికల్ 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) దేశంలోని ప్రజలందరికీ కుల, మతాలకతీతంగా వర్తిస్తాయి. ఐతే ఇప్పుడు ప్రత్యేకంగా బ్రాహ్మణులకు (లేదా వేరే ఇతర కులానికి) రక్షణ కల్పించేది ఏమి ఉండదు.

ఐతే వేధింపులు/అణచివేతకు సంబంధించి భారత రాజ్యంగంలో మహిళలు, షెడ్యూల్ తెగలు మరియు కులాలకు చెందిన ప్రజలకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నప్పటికీ, పైన చెప్పినట్టు ఈ అంశాలకు సంబంధించి రాజ్యంగం అందరికి రక్షణ కల్పిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి భారత శిక్షాస్మృతిలోని (IPC) కూడా వివిధ సెక్షన్లను ఏర్పాటు చేసారు, ఇందులో కొన్ని సెక్షన్లు కింద చూడొచ్చు.

IPC సెక్షన్ 153A – కింద ఏదైనా కుల, మత, భాష, మొదలైన ప్రాతిపదికన ఆ వర్గానికి చెందినవారిలో హింస ద్వారా భయం లేదా అభద్రతా భావాన్ని కలిగించే చర్యలు చేపట్టడం నేరంగా పరిగణిస్తారు.

IPC సెక్షన్ 153B – కూడా మాటల/రాతల ద్వారా ఒక కులానికి చెందిన వారిపట్ల ద్వేషాన్ని ప్రదర్శించడాన్ని నేరంగా పరిగణిస్తారు.

IPC సెక్షన్ 505 (2) – వివిధ కుల, మత, భాష, మొదలైన వర్గాల మధ్య విద్వేషం రగిలేలా ఎవరైనా వ్యాఖ్యానించడం లేదా పుకార్లు మొదలుపెట్టడం వంటి వాటిని ఈ సెక్షన్ ద్వారా క్రిమినల్ నేరం కింద పరిగణిస్తారు.

కులం ఆధారంగా వివక్ష/ ద్వేషానికి గురికాకుండా పైన పేర్కొన్న సెక్షన్లు రక్షిస్తాయి. ఈ సెక్షన్లు కులాలతో సంబంధం లేకుండా అందరికి వర్తిస్తాయి, బ్రాహ్మణులు కూడా ఈ సెక్షన్ల కింద రక్షణ పొందొచ్చు.

చివరగా, కుల వివక్షను భారత రాజ్యాంగం మరియు శిక్షాస్మృతి నిషేదిస్తున్నాయి. బ్రాహ్మణులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఇలా వ్యాఖ్యానించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll