Fake News, Telugu
 

వీడియోలోని దృశ్యాలు 1994 నాటి ఎన్.టి.ఆర్ ప్రమాణస్వీకారాన్ని చూపిస్తున్నాయి; 1983 ప్రమాణస్వీకారాన్ని కాదు

0

1983 జనవరి 09న నందమూరి తారక రామారావు మొదటిసారిగా సీఎం అయిన రోజు. ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 09 జనవరి 1983న ఎన్. టి. రామారావు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వీడియో. 

ఫాక్ట్: వైరల్ అవుతున్న వీడియో 12 డిసెంబర్ 1994న ఎల్బీ స్టేడియంలో ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దృశ్యాలను చూపిస్తుంది. అయితే 09 జనవరి 1983న ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఇదే స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు 1983వి కావు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా సంబంధిత పదాలతో వెతకగా, వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌కు సంబంధించిన పూర్తి వీడియో ‘Mana Stars’ యూట్యూబ్ ఛానెల్ లో లభించింది. ఈ వీడియో ప్రారంభంలోనే, “… on the 12th December of 1994 Krishan Kant, Shri N.T. RamaRao garu” అని చెప్పడం వినవచ్చు. ఈ వీడియోలో 1993లో ఎన్.టి.ఆర్ ను పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతిని చూడవచ్చు. అలాగే ప్రమాణ స్వీకారం చేయిస్తున్న అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ (1990-97) క్రిషన్ కాంత్‌ను చూడవచ్చు.

ఈ కార్యక్రమం 12 డిసెంబర్ 1994న హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగింది. సంబంధిత వీడియోలు మరియు వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఎన్.టి.ఆర్ మొదటిసారి 1983లో గెలిచినప్పుడు కూడా ఇదే స్టేడియంలోనే జనవరి 09న ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అప్పటి గవర్నర్ కె. సి. అబ్రహం ఎన్.టి.ఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఈనాడు పత్రిక ప్రచురించిన కథనంలో చూడవచ్చు, వీడియోని ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, 1994 ఎన్.టి.ఆర్ ప్రమాణ స్వీకారానికి చెందిన వీడియోని 09 జనవరి 1983న జరిగిన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం యొక్క వీడియోగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll