Fake News, Telugu
 

హర్యానాకి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాలు చేస్తున్న అరచాకాలని హిందూ మహిళ వివరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

రోహింగ్య ముస్లింలు తమపై దాడులు చేసి తమ ఇళ్ళను ఉన్నపళంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని పశ్చిమ బెంగాల్ హిందూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. బంగ్లాదేశ్ మరియు మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు, స్థానికంగా ఉండే భారతీయ హిందువుల ఇళ్లను, ఆస్తులను కబ్జా చేస్తు ఆడవారిని టార్గెట్ చేస్తున్నారని ఈ మహిళ పేర్కొన్నట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చిన వారికి ప్రభుత్వం రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇస్తుందని, కేవలం తెలంగాణ హైదరాబాదులోనే రోహింగ్యాలు 40,000 పైగా ఉన్నారని, దేశంలో 12 కోట్లుపైగా రోహింగ్యాలు ఆశ్రయం పొందుతున్నారని ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రోహింగ్యా ముస్లింలు తమపై దాడులు చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ హిందూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో హర్యానా రాష్ట్రం మేవత్ (ఇప్పుడు నుహ్) జిల్లాలో జరిగిన ఒక పాత మత ఘర్షణకు సంబంధించినది. 2020 మే నెలలో మేవత్ జిల్లా పున్హానలో చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లలో 2000 మందికిపైగా ముస్లింలు తమ ఇళ్ళపై దాడి చేసారని ఒక హిందూ బాధితురాలు మీడియాకి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియోతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి గానీ రోహింగ్యాలకు గానీ ఎటువంటి సంబంధం లేదు. భారత దేశంలో సుమారు 40,000 మంది రోహింగ్యాలు ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పలు సంధర్భాలలో చెప్పింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా వింటే, వీడియోలోని 0:35 నిమిషాల దగ్గర ఈ మహిళ, ముస్లిం దాడుల కారణంగా తాము మేవత్ విడిచి వెళ్ళవలసి వచ్చేలా ఉందని పేర్కొన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మేవత్ (ఇప్పుడు నుహ్) అనేది హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా. పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని ‘మెట్రో ప్లస్’ అనే ఫేస్‌బుక్ పేజీ 17 మే 2020 నాడు పోస్ట్ చేసినట్టు తెలిసింది. మేవత్ జిల్లా పున్హాన పట్టణంలో చెలరేగిన మత ఘర్షణలలో హిందువులు తమ ఇళ్లని విడిచి వెళ్ళవలసిన దుస్థితి ఏర్పడిందని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. పున్హాన మత ఘర్షణల తరువాత ఒక హిందూ బాధితురాలు తమపై జరిగిన దాడులని వివరిస్తున్న దృశ్యాలను ఈ వీడియో చుపిస్తుంది.

2000 మంది ముస్లింలు తమ ఇళ్లపై దాడి చేసారని, రాళ్ళూ రువ్వుతూ తన కుటుంబంలోని పెద్దవారిని, పిల్లలను సైతం గాయపరిచారని, జిల్లా ప్రభుత్వ అధికారులు, పోలీసులు తమకు ఎటువంటి సహాయం అందించకపోగా తమ కుటుంబంలోని అందరిని వారు అడుపులోకి తీసుకున్నారని ఈ మహిళ ఆరోపించింది. 2020 మే నెలలో మేవత్ జిల్లా పున్హానలో చోటుచేసుకున్న మతపరమైన అల్లర్లకు సంబంధించి ‘నవభారత్ టైమ్స్’ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. పున్హాన మత ఘర్షణలకు సంబంధించి పోలీసులు 300 మందిపై కేసు నమోదు చేసారని, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిని ఇప్పటికే అరెస్ట్ కూడా చేసారని ఈ ఆర్టికల్‌లో తెలుపుతున్నారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో హర్యానాలో జరిగిన పాత మత ఘర్షణలకు సంబంధించిందని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత దేశం మొత్తంలో సుమారు 18,000 శరణార్థులు (రోహింగ్యాలతో కలిపి) UNHCRతో రిజిస్టర్ అయ్యారని ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల విభాగమైన UNHCR ప్రకటించింది. దేశంలో ఉంటున్న రోహింగ్యాల సంఖ్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాలలో పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ,  ‘దేశంలో ఉంటున్న రోహింగ్యాలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలైతే లేవని, కాకపోతే అనధికారిక లెక్కల ప్రకారం దేశంలో సుమారు ఒక 40,000 మంది రోహింగ్యాలు ఉండవచ్చని’ తెలిపింది. హైదరాబాద్‌లో మొత్తం 4,835 మంది రోహింగ్యాలు ఉండగా, ఇందులో 4,561 మంది బయోమెట్రిక్ వివరాల సేకరణ పూర్తకాగా, ఇంకా 274 మంది వివరాల సేకరణ పెండింగ్ ఉన్నాయని రాచకొండ పోలీస్ 2020 నవంబర్ నెలలో ట్వీట్ ద్వారా తెలిపారు. అలాగే, దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వ సదుపాయాలు కల్పించవు. ఈ విషయాన్ని తెలుపుతూ FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.  

చివరగా, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వీడియోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలు చేస్తున్న అరచాకాలని హిందూ మహిళ వివరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll