Fake News, Telugu
 

హాకీ భారత దేశ జాతీయ క్రీడ కాదు; భారత దేశానికి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు

0

భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకున్న సందర్భంలో, హాకీ భారత దేశ జాతీయ క్రీడ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హాకీ భారత దేశ జాతీయ క్రీడ.

ఫాక్ట్(నిజం): హాకీ భారత దేశ జాతీయ క్రీడ కాదు, భారత దేశానికి ఒక జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. హాకీని జాతీయ క్రీడగా చేసే ప్రతిపాదనేదీ లేదని కూడా 2015లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

సాధారణంగా ప్రజలలో హాకీ మన దేశ జాతీయ క్రీడ అనే అభిప్రాయం ఉంది. కానీ చాలా మందికి తెలియని విషయం, భారత దేశానికి ఒక జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

2012లో ఐశ్వర్య పరాశర్ అనే 10 ఏళ్ల బాలిక ప్రధాన మంత్రి కార్యాలయాన్ని (PMO) సమాచార హక్కు చట్టం (RTI) కింద జాతీయ క్రీడకి సంబంధించిన సమాచారం కోరగా, PMO ఈ అభ్యర్ధనను క్రీడా మంత్రిత్వ శాఖకు ఫార్వార్డ్ చేసింది. ఐతే ఈ అభ్యర్ధనకు స్పందిస్తూ క్రీడా మంత్రిత్వ శాఖ భారత దేశానికి జాతీయ క్రీడా అంటూ ఏదీ లేదని స్పష్టం చేసింది. ఇలా ఈ విషయం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2015లో ఒకసారి పార్లమెంట్‌లో జాతీయ క్రీడకి సంబంధించి అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ అప్పటి క్రీడా శాఖ సహాయ మంత్రి భారత దేశానికి ప్రత్యేకించి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదని, పైగా హాకీని జాతీయ క్రీడగా చేసే ప్రతిపాదనేది కూడా లేదని స్పష్టం చేసారు.

అలాగే హిందీ మన జాతీయ భాష అని కూడా చాలా మంది అనుకుంటారు, కానీ భారత దేశానికి జాతీయ భాష అంటూ ఏది లేదు, కాకపోతే హిందీ మరియు ఇంగ్లీష్‌ని అధికారిక భాషగా గుర్తించారు. మేము ఇంతకు ముందే జాతీయ చిహ్నాలకు సంబంధించి రాసిన కథనంలో ఈ అపోహాల గురించి ప్రస్తావించము, ఈ కథనాన్ని ఇక్కడ చదవవొచ్చు.

చివరగా, హాకీ భారత దేశ జాతీయ క్రీడ కాదు ; భారత దేశానికి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు.

Share.

About Author

Comments are closed.

scroll