Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోలను ప్రస్తుతం టర్కీలో వ్యాపిస్తున్న మంటలవంటూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల టర్కీలోని అడవుల్లో మంటలు చెలరేగి పెద్ద సంఖ్యలో చెట్లు, జంతువులూ కాలిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో టర్కీలో కాలిపోతున్న అడవులకి సంబంధించిన ఫోటోలంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టర్కీలో కాలిపోతున్న అడవులకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో కొన్ని టర్కీకి సంబంధించినవి కావు. మరికొన్ని గతంలో టర్కీలో వ్యాపించిన మంటలకి సంబంధించినవి. ఈ ఫొటోలకి ప్రస్తుతం టర్కీలో వ్యాపిస్తున్న మంటలకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఫోటో 1:

2020లో టర్కీలోని ఆలివ్ తోటలలో వ్యాపించిన మంటలకి సంబంధించిన వార్తను ప్రచురించిన పలు టర్కీకి చెందిన ఆన్‌లైన్‌ వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఇదే ఫోటోని ప్రచురించాయి. ఐతే ఈ ఫోటో 2020లో వ్యాపించిన మంటలకి సంబంధించిందని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, ఈ కథనాల తేదీ బట్టి ఈ ఫోటో ప్రస్తుతం టర్కీలో వ్యాపిస్తున్న మంటలకు సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

ఫోటో 2:

ఈ ఫోటో అమెరికాలోని మోంటానా రాష్ట్రంలో ఉన్న బిట్టర్ రూట్ నేషనల్ ఫారెస్ట్‌లో 2000 సంవత్సరంలో మంటలు చెలరేగిన (ఫారెస్ట్ ఫైర్స్) ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2017లో ప్రచురించిన ఒక కథనం కనిపించింది, ఈ కథనం ప్రకారం ఈ ఫోటో అమెరికాలో జరిగిన ఫారెస్ట్ ఫైర్స్‌కి సంబంధించిందని స్పష్టమవుతుంది. ఇదే ఫోటోని ప్రచురించిన కొన్ని పాత కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఫోటో 3:

ఈ ఫోటోకి సంబంధించి కచ్చితమైన సమాచారం మాకు లభించలేదు.

ఫోటో 4:

ఈ ఫోటో ఏ ఘటనకి సంబంధించిందో కచ్చితమైన సమాచారం తెలియనప్పటి ఇదే ఫోటోని 2019లో ఫారెస్ట్ ఫైర్స్ పై రాసిన ఒక కథనంలో ప్రచురించారు, దీన్నిబట్టి ఇది పాత ఫోటో అని, ఈ ఫోటోకి ఇప్పుడు టర్కీ అడవుల్లో వ్యాపిస్తున్న మంటలకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఫోటో 5:

టర్కీకి చెందిన ఒక ఆన్‌లైన్‌ న్యూస్ పోర్టల్ ఇదే ఫోటోని 2019 టర్కీ అడవుల్లు చెలరేగిన మంటలకు సంబంధించిన వార్తలో ప్రచురించింది. ఐతే ఈ ఫోటో ఆ మంటలకు సంబంధించిందో కాదో కచ్చితమైన సమాచారం తెలియనప్పటికీ, ప్రస్తుతం టర్కీలో వ్యాపిస్తున్న మంటలకి సంబంధించింది కాదని అర్ధం చేసుకోవచ్చు.

ఫోటో 6:

2020లో టర్కీలో వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చిన విషయానికి సంబంధించి టర్కీ ప్రభుత్వ వెబ్సైటులో రాసిన ఒక కథనంలో ఇదే ఫోటోని ప్రచురించారు. అలాగే 2020లో ప్రచురించిన ఒక టర్కిష్ వార్తా కథనంలో కూడా ఇదే ఫోటోని ప్రచురించారు, దీన్నిబట్టి ఈ ఫోటో టర్కీలో వ్యాపించిన మంటలకు సంబంధించిందే అయినా ప్రస్తుతం వ్యాపిస్తున్న మంటలకి సంబంధించింది కాదని స్పష్టమవుతుంది.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోలను ప్రస్తుతం టర్కీలో వ్యాపిస్తున్న మంటల వంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll