26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు, లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మే 2025లో ఆపరేషన్ సిందూర్ తర్వాత, లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2017 నాటిది. ఈ వీడియోకు, మే 2025 లో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఎటువంటి సంబంధం లేదు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అతను మీడియాకు బహిరంగ ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు, విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను AP ఆర్కైవ్ యూట్యూబ్ ఛానల్‌లో 05 ఫిబ్రవరి 2017న షేర్ చేసినట్లు కనుగొన్నాము.
ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో 31 జనవరి 2017 నాటిది అని తెలుస్తుంది. ఆ రోజు సయీద్‌ను, అతని నలుగురు సహాయకులను పాకిస్తాన్‌లో హౌస్ అరెస్ట్‌లో పెట్టారు. ఫలాహ్ ఇన్సానియత్ ఫౌండేషన్ అనే చారిటీ సంస్థపై చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఈ ఐదుగురిని 90 రోజులు డిటైన్ చేయాలని ఈస్ట్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన సెక్యూరిటీ అధికారి అజాం సులేమాన్ ఆదేశించినట్లు మాకు తెలిసింది.

ఈ సంఘటనకు సంబంధించిన 2017 జనవరిలో ప్రచురించబడిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, హఫీజ్ సయీద్‌ను డిటైన్ చేసిన విషయం స్పష్టం అయింది. అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీ ఈ చర్యను ‘జాతీయ ప్రయోజనం’ కోసమే తీసుకున్నట్టు తెలిపింది. అలాగే, సయీద్ డిటెన్షన్ అనంతరం పాకిస్తాన్‌లో నిరసనలు జరిగినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి.

యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రిపోర్ట్స్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ) హఫీజ్ సయీద్ ప్రస్తుతం ఏడు ఉగ్రవాద నిధుల కేసులలో దోషిగా నిర్ధారించబడి 78 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతని శిక్ష 12 ఫిబ్రవరి 2020 నుంచి ప్రారంభమైంది అతను లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తన శిక్షను వ్యతిరేకించినట్లు (ఇక్కడ, ఇక్కడ) మాకు తెలిసింది.

చివరిగా, 2017లో హఫీజ్ సయీద్ మీడియాతో మాట్లాడిన వీడియోను ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇచ్చిన తాజా ఇంటర్వ్యూగా పేర్కొంటూ షేర్ చేస్తున్నారు.