Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోలని దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారానికి ముడి పెడుతున్నారు

0

‘03 నవంబర్ 2020’ నాడు దుబ్బాక నియజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో తెరాస పార్టీ లీడర్లు ప్రచారంలో భాగంగా మద్యం పంచుతున్న దృశ్యాలని చెప్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. దుబ్బాక నియజకవర్గం ఉప ఎన్నికల ప్రచారాలకి సంబంధించిన ఫోటోలు అని క్లెయిమ్ చేస్తున్న ఈ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస పార్టీ మద్యం పంపణీ చేస్తున్న ఫోటోలు.

ఫాక్ట్ (నిజం):  ఈ పోస్టులలో షేర్ చేసిన ఫోటోలు పాతవి. ఈ ఫొటోలకి దుబ్బాకలో జరుగబోతున్న ఉప ఎన్నికలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

ఫోటో-1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్టులు దొరికాయి. వీటిలో కొన్ని పోస్టులు 2016లోనే సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ పోస్టులని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటో బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక గ్యాంగ్ స్టార్ కూతురి వివాహానికి సంబంధించిందని ఒక పోస్టులో తెలిపారు.

ఇదే ఫోటోని ‘imgur’ అనే ఇమేజ్ షేరింగ్ వెబ్సైటులో ‘27 మే 2016’ నాడు ఒక యూసర్ అప్లోడ్ చేసారు. భారత దేశంలో జరిగిన ఒక వివాహానికి సంబంధించిన ఫోటోలని ఆ యూసర్ ఈ వెబ్సైటులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఫోటో-2 :

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పాత పోస్ట్ ఒకటి దొరికింది. ఈ ఫోటోని ఒక యూసర్ ‘07 నవంబర్ 2018’ నాడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఈ ఫోటో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఈ ఫోటో పాతది అని మనం చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోలని చూపిస్తూ దుబ్బాక ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఫోటోలని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll