Fact Check, Fake News, Telugu
 

‘బ్లూ మూన్’ రోజు చంద్రుడు నీలం (బ్లూ) రంగులో కనిపించడు

0

76 ఏళ్ల తరవాత అక్టోబర్ నెలలో ఆకాశంలో అద్భుతం జరగబోతుందని, ఈ నెలలో 31వ తేదీన చంద్రుడు నీలం రంగులో కనిపించబోతున్నాడని, దీనిని బ్లూ మూన్ అంటారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విషయాన్ని చెప్పిన NTV వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 76 ఏళ్ల తరవాత 2020, అక్టోబర్ 31వ తేదీన వచ్చే బ్లూ మూన్ రోజున చంద్రుడు నీలం రంగులో కనిపించబోతున్నాడు.

ఫాక్ట్(నిజం): NASA లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అంటారు. బ్లూ మూన్ రోజున చంద్రుడు ఎప్పటిలాగానే కనిపిస్తాడు. ఈ రోజు ప్రత్యేకంగా బ్లూ కలర్ లో కనిపిస్తాడన్న వార్తలో నిజం లేదు. ఐతే ఆకాశంలో ఉండే దుమ్ము, పొగ వల్ల రంగు వేరేలా కనిపించే అవకాశం ఉందని NASA చెప్తుంది. ఐతే అక్టోబర్ 31న కనిపించే బ్లూ మూన్ 76 ఏళ్ల తరవాత అన్ని టైం జోన్లలో కనిపిస్తుందని కొన్ని కథనాలు ప్రచురించగా, 76 ఏళ్ల తరవాత హాల్లోవీన్ రోజున బ్లూ మూన్ కనిపిస్తుందని కొన్ని కథనాలు ప్రచురించాయి. కావున పోస్టులో చెప్తున్నది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వార్త గురించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా, బ్లూ మూన్ కి సంబంధించిన వార్తా కథనం మాకు కనిపించింది, ఈ కథనం ప్రకారం సాధారణంగా ప్రతి నెల ఒక పౌర్ణమి చంద్రడు కనిపిస్తాడు, కాకపోతే ప్రతి మూడు సంవత్సరాలకొకసారి లూనార్ సైకిల్ మరియు క్యాలెండరు ఇయర్ పూర్తిగా సింక్రనైజ్ కాని కారణంగా ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తుంద. ఈ రెండో పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్ అంటారు. 31 అక్టోబర్ 2020న కూడా ఇలా జరగనుంది. ఐతే ఈ బ్లూ మూన్ అనేది సాధారంగా జరిగేదైనా, ఇది అన్ని టైం జోన్లలో కనిపించదు, కేవలం ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఐతే ఈ సంవత్సరం అక్టోబర్ 31న కనిపించే బ్లూ మూన్ మాత్రం ప్రపంచంలోని అన్ని టైం జోన్లలో కనిపించనుంది, 76 సంవత్సరాల తర్వాత ఇలా జరగనుంది, ఇలా చివరగా 1944లో జరిగింది. పైగా ఈ వార్తా కథనం ప్రకారం ఆకాశంలోని పొగ, దుమ్ము కారణంగా చంద్రుడు వేరే రంగులో కనిపించవచ్చు గాని బ్లూ మూన్ రోజు చంద్రడు నీలి రంగులో కనిపిస్తాడన్న వార్తలో వాస్తవంలేదు, ఈ రోజు చంద్రుడు ఎప్పటి రంగులోనే కనిపిస్తాడు. ఇదే విషయం తెలుపుతున్న మరొక వార్త కథనం ఇక్కడ చూడొచ్చు.

బ్లూ మూన్ గురించి NASA చెప్తున్నదాని ప్రకారం సంవత్సరంలో అదనంగా కనిపించే పౌర్ణమి చంద్రుడిని బ్లూ మూన్ అంటారు, ఇలా రెండున్నర సంవత్సరాలకొకసారి జరుగుతుంది. 1940నుండి నెలలో కనిపించే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అనడం మొదలుపెట్టారు. ఆ రోజు చంద్రుడు ఎప్పటి రంగులోనే కనిపిస్తాడు, ప్రత్యేకంగా బ్లూ కలర్ లో కనిపించడు. బ్లూ మూన్ కి సంబంధించిన మరొక నాసా కథనం ఇక్కడ చదవొచ్చు.

లండన్ లోని రాయల్ మ్యూజియం గ్రీన్విచ్ కూడా బ్లూ మూన్ రోజు చంద్రుడు బ్లూ కలర్ లో కనిపించడని కచ్చితంగా చెప్తుంది. ఐతే మ్యూజియంలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంవత్సరంలో వచ్చే అదనపు పౌర్ణమిని బ్లూ మూన్ అంటారని ఉంది. 2020 తర్వాత వచ్చే బ్లూ మూన్ తేదీలు కూడా ఈ వెబ్సైటు లో ఇచ్చారు. 2020 తర్వాత, 2023, 2026, 2028లో కూడా బ్లూ మూన్ వస్తుంది.

ఐతే నాసాలో గాని రాయల్ మ్యూజియంలో ఉన్న సమాచారంలో ఎక్కడ కూడా 31 ఆక్టోబర్ న కనిపించే బ్లూ మూన్ 1944 తరవాత అన్ని టైం జోన్లలో కనిపిస్తుందని చెప్పలేదు. ఐతే కొన్ని వెబ్సైట్లలో ఉన్న సమాచారం ప్రకారం 76 ఏళ్ల తరవాత హాలోవీన్ రోజున బ్లూ మూన్ కనిపిస్తున్నదని ఉంది, ఇలా 1944 తరవాత ఇప్పుడే జరుగుతుందని ఉంది.

చివరగా, బ్లూ మూన్ రోజు చంద్రుడు ఎప్పటిలాగే కనిపిస్తాడు, బ్లూ కలర్ లో కనిపించడు.

Share.

About Author

Comments are closed.

scroll