Fake News, Telugu
 

భారతీయ జ్యోతిష్య శాస్త్రాలని, సాంప్రదాయాలను పొగుడుతూ నాసా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

గ్రహణాలు గురించి ఖచ్చితమైన సమాచారం భారతీయ పంచాంగమే ఇస్తుందని నాసా (NASA) శాస్త్రవేత్తలు వెల్లడించారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. అంతేకాదు, భారతీయ సాంప్రదాయమైన రాగి చెంబులో తాగే నీరు అత్యుత్తమ నీరని జర్మన్ శాస్త్ర వేత్తలు కొనియాడినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు, ఆ పోస్టులో ఎంతవరకు నిజం ఉందొ చూద్దాం.

క్లెయిమ్: భారతీయ పంచాంగం, భారతీయ సాంప్రదాయ పద్దతులని నాసా (NASA), జర్మన్ శాస్త్రవేత్తలు కొనియాడారు.

ఫాక్ట్ (నిజం): భారతీయ పంచాంగం, జ్యోతిష్య శాస్త్రాలను కొనియాడుతూ నాసా (NASA) ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. రాగి వస్తువులలో నిల్వ చేసే నీరు శ్రేష్టకరమైనవని NCBI లో పబ్లిష్ అయిన రెసెర్చ్ పేపర్స్, ఇతర విదేశీ ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. రాగి చెంబు నీరుకి సంబంధించి భారతీయ సాంప్రదాయాలను కొనియాడుతూ జర్మనీ శాస్త్రవేత్తలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం NASA వెబ్సైటులో వెతికితే, భారతీయ పంచాంగం, జ్యోతిష్య శాస్త్రాలను కొనియాడుతూ నాసా (NASA) ఎటువంటి ప్రకటన లేదా ప్రెస్ రిలీజ్ జారీ చేయలేదని తెలిసింది. ‘NASA Space Place’ వెబ్సైటులో ఆస్ట్రానమీకి జ్యోతిష్య శాస్త్రానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ‘జ్యోతిష్యం అనేది ఆకాశంలో కొన్ని నక్షత్రాలు, గ్రహాల స్థానం బట్టి ఒక వ్యక్తి  భవిష్యత్తును లేదా అతని వ్యక్తిత్వాన్ని అంచన వేస్తారు. కొన్ని సంస్కృతీ సంప్రదాయాలకు జ్యోతిష్యం ముఖ్యమైనది అయినప్పటికీ, దాని వాదనలు శాస్త్రీయ ఆధారాలపై ఆధారపడి లేవు’, అని నాసా తమ వెబ్సైటులో తెలిపింది. దీన్ని బట్టి, పోస్టులో తెలుపుతున్నట్టు నాసా భారతీయ పంచాంగాన్ని, జ్యోతిష్య శాస్త్రాలని పొగుడుతూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టమయ్యింది.

అలాగే, రాగి చెంబులో నిల్వ చేసిన నీరుకు సంబంధించి జర్మనీ శాస్త్రవేత్తలు నిజంగా భారత సంప్రదాయాలను కొనియాడారా అని వెతికితే, అటువంటి వ్యాఖ్యలేవి జర్మన్ శాస్త్రవేత్తలు చేయలేదని తెలిసింది. ఒక వేళ జర్మన్ శాస్త్రవేత్తలు  నిజంగా అలాంటి ప్రకటన చేసివుంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేసినట్టు మాకు ఆధారాలు దొరకలేదు.

రాగి వస్తువులలో నిరు నిల్వ చేయడం ద్వార నీరులో ఉండే డయేరోజెనిక్ బాక్టీరియా చనిపోతుందని NCBIలో పబ్లిష్ అయిన రీసెర్చ్ పేపర్స్, ఇతర విదేశీ ఆరోగ్య సంస్థలు తమ పరిశోధన పేపర్లలో వెల్లడించారు. కాని, రాగి చెంబు నీరుకి సంబంధించి భారతీయ సాంప్రదాయాలను కొనియాడుతూ జర్మనీ శాస్త్రవేత్తలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

చివరగా, భారతీయ జ్యోతిష్య శాస్త్రాలని నాసా (NASA) కొనియాడలేదు; రాగి చెంబు నీరుకి సంబంధించి భారతీయ సాంప్రదాయాలను కొనియాడుతూ జర్మనీ శాస్త్రవేత్తలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll