Fake News, Telugu
 

ఈ వీడియోలో అభిషేకం చేస్తున్న పాలు నీలి రంగులో కనపడడం వింతేమీ కాదు, ఇది ‘టిండల్ ప్రభావం’ వల్ల జరుగుతుంది.

0

శివ లింగానికి అభిషేకం చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేస్తూ, తమిళనాడు తిరువారూర్ సమీపంలో నాగకుడి అనే గ్రామంలో శివలింగానికి రాహుకాలంలో పాలతో అభిషేకిస్తే అవి నీలి రంగులో మారుతాయి అని చెబుతున్నారు. దీని వెనుక ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తమిళనాడు తిరువారూర్ సమీపంలో నాగకుడి అనే గ్రామంలో శివలింగానికి రాహుకాలంలో పాలతో అభిషేకం చేస్తే అవి నీలి రంగులో మారుతాయి. 

ఫాక్ట్ (నిజం): కొంత మోతాదులో పాలను కలిపిన నీటిలో కాంతి పడ్డప్పుడు, అది నీలి రంగుగా కనిపించడం మాత్రమే జరుగుతుంది.  దీనిని టిండల్ ప్రభావం అంటారు. రాహుకాలం సమయంలో పాలు నీలం రంగులోకి మారతాయనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

నీళ్లలో కొన్ని చుక్కల పాలు కలిపి, దాని గుండా వెలుతురును ప్రసారం చేసినప్పుడు, అది నీలి రంగును చూపుతుంది. దీనికి కారణం పాలలో వెలుతురు చెదరడం. దీనిని టిండల్ ప్రభావం అంటారు. పాలు ఒక కొలాయిడ్. పాలలో కొవ్వు యొక్క గ్లోబ్యూల్స్ మరియు ప్రోటీన్ మొలిక్యూల్స్ ఉంటాయి. ఇవి నీటి కంటే ఎక్కువ వెలుతురును వెదజల్లగలవు.

వెలుతురు అనేది వివిధ రంగుల ఫోటాన్లు యొక్క ప్రవాహం. వివిధ రంగుల ఫోటాన్లు వేర్వేరు తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. నీలం ఫోటాన్లు తక్కువ తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. తక్కువ తరంగదైర్ఘ్యం ఫోటాన్లు ఎక్కువ చెదరగొట్టబడతాయి/వెదజల్లబడతాయి. అందువల్ల, పాలు కలిసిన నీళ్ల గుండా వెలుతురును ప్రసారం చేసినప్పుడు, నీలిరంగు ఫోటాన్లు ఎక్కువగా చెదరగొట్టబడి అవి నీలి రంగుగా కనిపిస్తాయి. 

ఈ నీలి రంగు యొక్క తీవ్రత, పాల కణాల సైజు, కణాల పరిమాణం, కాంతి యొక్క కోణం మరియు తీవ్రత వంటి అంశాలను బట్టి మారవచ్చు. కాబట్టి, పాలు వేసిన నీళ్ళలో నీలిరంగు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండకపోవచ్చని గమనించడం ముఖ్యం. టిండల్ ప్రభావం, ఆకాశం యొక్క నీలిరంగు మరియు కొన్ని గ్లేసియర్ల యొక్క రంగు వంటి ఇతర ఉదాహరణలకు కూడా కారణమవుతుంది.

రాహుకాలం సమయంలో పాలు నీలం రంగులోకి మారతాయనే వాదనకు ఎటువంటి  శాస్త్రీయ ఆధారం లేదు.అభిషేకం చేస్తుంటే పాలు నీలి రంగులో మారాయి అంటూ షేర్ చేసిన మరికొన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ  చూడవచ్చు. 

చివరిగా, ఈ వీడియోలో అభిషేకం చేస్తున్న పాలు నీలి రంగులో మారటం వింతేమీ కాదు, ఇది టిండల్ ప్రభావం వల్ల జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll