Fake News, Telugu
 

పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే మొత్తం వాక్సిన్, రేషన్, రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నారన్న వాదనలో నిజం లేదు

0

పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వాలు వసూలు చేసే మొత్తాన్ని ఉచిత వాక్సిన్, రేషన్, రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నాయని అర్ధం వచ్చేలా చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వాలు వసూలు చేసే మొత్తాన్ని ఉచిత వాక్సిన్, రేషన్ మరియు రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నాయి.

ఫాక్ట్ (నిజం): కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ, సెస్ రూపంలో వసూలు చేసే రూ. 32.31లో  సుమారు 63.5% అనగా రూ. 20.50 కేవలం రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్‌పై మాత్రమే ఖర్చు చేస్తారు. మిగిలిన 36.5% పూర్తిగా వాక్సిన్ లేదా రేషన్‌పై ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీలర్లకు అందించే ధర, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సయిజ్ డ్యూటీ , డీలర్ కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ మొత్తం అన్ని కలిపితే లీటర్ పెట్రోల్‌కి వినియోగదారుడు చెల్లించే ధర వస్తుంది. ఉదాహరణకి ఢిల్లీలో పెట్రోల్ ధరలో ఎవరకి ఎంత చెందుతుందో ఇక్కడ చూడొచ్చు. ఐతే వీటిలో కేవలం ఎక్సయిజ్ డ్యూటీ, రాష్ట్ర టాక్స్ మాత్రమే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి.

పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ క్రింద లిస్ట్ చేసిన నాలుగు విధాలుగా ఎక్సయిజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.

  • బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED) – లీటర్ పెట్రోలుపై రూ. 1.40
  • స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) – లీటర్ పెట్రోలుపై రూ.11
  • అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) – లీటర్ పెట్రోలుపై  రూ. 18
  • అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC) – లీటర్ పెట్రోలుపై  రూ. 2.50

బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్రాల వాటా కింద రూ. 0.57 పైసలు తీసేస్తే, మిగిలిన టాక్స్ మరియు సెస్స్‌ల రూపంలో కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోలుపై మొత్తంగా రూ. 32.31 వసూలు చేస్తుంది. పెట్రోల్‌పై విధించే టాక్స్‌లలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వాటాకి సంబంధించి FACTLY రాసిన కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. 

సాదారణంగా సెస్స్‌లను ముందుగా నిర్దేశించిన ప్రయోజనం కోసం వసూలు చేస్తారు కాబట్టి  రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే దానిని కేవలం ఆ పనులకు మాత్రమే వాడతారు. పైగా వీటిలో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. అంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వసూలు చేసే రూ. 32.31లో  సుమారు 63.5% అనగా రూ. 20.50 కేవలం రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్‌కి మాత్రమే ఖర్చు చేస్తారు.

మిగిలిన రూ. 11.81 మాత్రమే ఇతర అవసరాలకు ఖర్చు చేస్తారు. మిగిలిన రూ. 11.81 పూర్తిగా వాక్సిన్ లేదా రేషన్‌పై ఖర్చు చేస్తునట్టు ఎటువంటి సమాచారం లేదు, పైగా కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తున్నట్టు ఎప్పుడు చెప్పలేదు. దీన్నిబట్టి పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసేది మొత్తం ఉచిత వాక్సిన్, రేషన్, రక్షణ రంగంపై ఖర్చు చేస్తుందన్న వాదన సరైనది కాదని తేలిపోతుంది.

ఇకపోతే పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్టేట్ టాక్స్ మరియు బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో రాష్ట్ర వాటా కింద వచ్చేది మాత్రమే రాష్ట్రాలకు చెందుతాయి. ఐతే వాక్సిన్, రేషన్ , రక్షణ అనేవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కాబట్టి వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసేది ఏమి ఉండదు.

చివరగా, పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే మొత్తం వాక్సిన్, రేషన్ మరియు రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నారన్న వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll