Fake News, Telugu
 

1917లో ఒక రూపాయి విలువ సుమారు $0.314 అమెరికన్ డాలర్లుగా ఉంది

0

“సరిగ్గా 107 సంవత్సరాల క్రితం అనగా 1917లో మన భారతదేశ కరెన్సీ ఒక రూపాయి ఇస్తే అమెరికా వాడు 13 రూపాయలు ఇచ్చేవాడు, కానీ ఇప్పుడు అమెరికా వాడు ఒక్క డాలర్ (USD) ఇస్తే మనం 82 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వాదనలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 1917లో ఒక రూపాయి $13 USDకి సమానం, అలాగే 2014లో $1 USD విలువ 63 రూపాయిలుగా ఉంది, కానీ ఇప్పుడు 2024లో $1 USD  విలువ 82 రూపాయలకు సమానం.

ఫాక్ట్(నిజం): RBI ప్రకారం, 1917లో ఒక రూపాయి విలువ సుమారు $0.314 అమెరికన్ డాలర్లుగా ఉంది. 1947లో అమెరికా డాలర్‌ (USD)తో రూపాయి సగటు వార్షిక మారకం రేటు సుమారు రూ. 3.32 గా ఉంది. అలాగే 2014లో 61.0295 గా ఉంది. ఈ కథనం రాసిన రోజు అనగా 06 డిసెంబర్ 2024న USD తో రూపాయి మారకం రేటు రూ. 84.6578 గా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇలాంటి వాదనలతో గతంలోనూ పలు పోస్టులు వైరల్ అయినట్లు మేము గుర్తించాము (ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్, లింక్).

1917లో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉందని, విదేశీ మారకద్రవ్యం బ్రిటిష్ కరెన్సీ (పౌండ్)లో జరిగిందని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే వైరల్ క్లెయిమ్‌లో పేర్కొన్నట్లుగా 1917లో ఒక రూపాయి విలువ $13 అమెరికా డాలర్లు(USD) గా ఉందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ‘Currency, Exchange and Banking Prior to 1935’ అనే డాక్యుమెంట్‌ లభించింది. ఈ డాక్యుమెంట్‌ (ఆర్కైవ్డ్ లింక్)ప్రకారం, 1917 సంవత్సరంలో, ఒక రూపాయి విలువ 1 షిల్లింగ్ 4 పెన్స్ (1 రూపాయి = 1 shilling 4 pence – 1s 4d) గా ఉంది.. ‘S’ అంటే ‘షిల్లింగ్‌లు’ మరియు ‘d’ అంటే ‘పెన్స్’ (Pence or pennies). ఇవి ఆ రోజుల్లో 1 పౌండ్ లో విభజించబడిన చిన్న డినామినేషన్‌లు. ఒక పౌండ్ 20 షిల్లింగ్స్ లేదా 240 పెన్నీలుగా విభజించబడింది. అంటే 1917లో ఒక రూపాయి 0.066 పౌండ్లకు సమానం. అప్పటికి ఉన్న మారకపు రేటు ప్రకారం ఒక రూపాయి లేదా 0.06 పౌండ్లను డాలర్‌లుగా మారిస్తే $0.314 USD కి సమానం. అంటే 1917లో $1 USD విలువ రూ. 3.33 గా ఉంది. దీని ఆధారంగా, 1917లో ఒక రూపాయి $13 USDకి సమానం అనే వాదన తప్పు అని మనం నిర్ధారించవచ్చు.

అలాగే RBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న రూపాయి-డాలర్ మారకపు రేటుకు సంబంధించిన చారిత్రక డేటా (ఆర్కైవ్డ్ లింక్) ప్రకారం, 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు $100 అమెరికన్ డాలర్ల విలువ రూ. 332.25 గా ఉంది. అంటే అమెరికా డాలర్‌ (USD)తో రూపాయి సగటు వార్షిక మారకం రేటు సుమారు రూ. 3.32 గా ఉంది.

RBI డేటా ప్రకారం, 2014 సంవత్సరంలో అమెరికా డాలర్‌ (USD)తో రూపాయి సగటు వార్షిక మారకం రేటు 61.0295 గా ఉంది (ఆర్కైవ్డ్ లింక్).

RBI వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు అనగా 06 డిసెంబర్ 2024న అమెరికా డాలర్‌ (USD)తో రూపాయి మారకం రేటు రూ. 84.6578 గా ఉంది. వివిధ విదేశీ కరెన్సీతో రూపాయి మారకం రేటును ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ మారకపు రేటు నిరంతరం మారుతూ ఉంటుంది.

చివరగా, 1917లో ఒక రూపాయి విలువ $13 అమెరికన్ డాలర్లు (USD) గా ఉంది అనే వాదన తప్పు, 1917లో $1 USD విలువ రూ. 3.33 గా ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll