Fake News, Telugu
 

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్/డీజిల్ ధరలు తగ్గించిందన్న వార్త నిజం కాదు

0

ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్ రూ.60, డీజిల్ రూ.40 మరియు గ్యాస్ రూ. 450కే అందించనుందని ప్రకటించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ కూడా రేట్లు తగ్గుతాయని చెప్పే క్రమంలో కర్ణాటక ఉదాహరణను తీసుకున్నారు. ఐతే ఈ కథనం ద్వారా కర్ణాటకలో ధరలకు సంబంధించి పోస్టులో చెప్తున్న విషయంలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్ రూ.60, డీజిల్ రూ.40 మరియు గ్యాస్ రూ. 450కే అందించనుందని ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): కర్ణాటకలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే పెట్రోల్/ డీజిల్/గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కర్ణాటకలో ఇంధన ధరలు ఇంతకు ముందు ఉన్నట్టే ఉన్నాయి. అసలు తాము అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కాంగ్రెస్ పార్టీ ఇంధన ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో ప్రస్తావించలేదు:

కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే వివిధ రంగాలలో తాము చేయబోయే పనులకు సంబంధించి ఒక సంక్లిప్తమైన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో ప్రతీ కుటుంబంలోని మహిళా పెద్దలకు గృహలక్ష్మి స్కీం కింద రూ. 2,000 నెలవారీ అందించడం, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువనిధి పథకం కింద గ్రాడ్యుయేషన్ చేసిన యువతకు ప్రతి నెల రూ.3,000 మరియు డిప్లొమా హోల్డర్లు రూ.1,500 అందించడం, ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల బియ్యం (అన్నభాగ్య) మరియు ప్రజా రవాణాలో మహిళకు ఉచిత ప్రయాణం (శక్తి),  మొదలైన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా ప్రస్తావించింది.

ఐతే ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే పెట్రోల్/ డీజిల్/గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వాగ్ధానం చేయలేదు.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గిస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు:

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తమ మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, శక్తి పథకాల అమలుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఐతే ఈ కాబినెట్ మీటింగ్‌లో గానీ, ఆ తరవాత గానీ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కాని మాకు అలాంటి వార్తా కథనాలేవి కనిపించలేదు.

కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంధన ధరలు తగ్గించందన్న వార్త కల్పితం అని అర్ధం చేసుకోవాలి.

కర్ణాటకలో ఇంధన ధరలు యదావిధిగా ఉన్నాయి:

ఇదిలా ఉంటే ప్రస్తుతం కర్ణాటకలో పెట్రోల్/డీజిల్ ధరలు ఇంతకు ముందు ఉన్నట్టే ఉన్నాయి. ఉదాహరణకు బెంగుళూరులోని పలు IOC పెట్రోల్ బంక్‌లలో ఈ రోజు అమలులో ఉన్న పెట్రోల్/ డీజిల్ ధరలు కింది టేబుల్‌లో చూడొచ్చు.

ఇకపోతే తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే పోస్టులో చెప్తున్నట్టు పెట్రోల్/ డీజిల్/గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తామని అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

చివరగా, కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్/డీజిల్ ధరలు తగ్గించిందన్న వార్త నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll