Fake News, Telugu
 

1981లో ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్లబండి పై తరలించింది ఓపెన్ ఫీల్డ్‌లో యాంటెన్నా పరీక్ష నిర్వహించడానికి, నిధుల కొరత వలన కాదు

0

1981లో ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని నిధుల కొరత కారణంగా ఎడ్లబండి పై తరలించింది, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుండి.  1977లో రాహుల్ గాంధీ పుట్టినరోజుని చార్టెడ్ విమానంలో విలాసంగా జరిపించిన ఇందిరా గాంధీ, భారతదేశానికి ఎంతో అవసరమైన యాపిల్ శాటిలైట్‌ కోసం నిధులు కేటాయించలేదని అర్థం వచ్చేలా ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 1981లో ఇస్రో సంస్థ భారతదేశానికి ఎంతో ముఖ్యమైన ‘APPLE’ శాటిలైట్‌ని నిధుల కొరత వలన ఎడ్లబండి పై తరలించారు.

ఫాక్ట్ (నిజం): 1981లో ఇస్రో సంస్థ యాపిల్ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తరలించిన మాట వాస్తవం. కాని, నిధుల కొరత వలన ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తరలించలేదు. నాన్ మాగ్నెటిక్ వాతావరణంలో యాంటెన్నా పరీక్ష నిర్వహించడానికి ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఇలా ఎడ్ల బండి పై తరలించింది. 1977లో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు జరిగే సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రధాని కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో చేస్తున్న చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, 1981లో ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తరలించిన ఘటనకు సంబంధించి ‘Live Mint’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. భారతదేశపు మొట్టమొదటి జియోస్టేషనరీ శాటిలైట్‌ ‘APPLE’ (Ariane Passenger Payload Experiment)ని ఎడ్ల బండి పై ఎందుకు తరలించాల్సి వచ్చిందో ఇస్రో మాజీ సైంటిస్ట్ RM వసఘన్ తను పబ్లిష్ చేసిన ఒక పేపర్లో తెలిపినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు.  

‘APPLE’ శాటిలైట్‌లోని టెలీమెట్రి, ట్రాకింగ్, కంట్రోల్ విభాగంలో లోపాలను గుర్తించిన ఇస్రో సంస్థ, లాంచ్‌కు ముందు శాటిలైట్‌పై పరీక్ష నిర్వహించి ఆ లోపాలను సరిచేయాలనుకుంది. దీనికోసం ‘APPLE’ శాటిలైట్‌ని థర్మల్ బ్లాంకెట్ సౌకర్యంలో పెట్టి పరీక్ష నిర్వహించాలి. నాలుగు దశాబ్దాల ముందు ఇస్రో సంస్థకు అటువంటి సదుపాయాలు లేవు. దీనితో ‘APPLE’ శాటిలైట్‌ని నాన్ మాగ్నెటిక్ వాతావరణంలో పెట్టి యాంటెన్నా పరీక్ష నిర్వహించాలని ఇస్రో సంస్థ యోచించింది. ఈ కారణంగానే ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తరలించినట్టు RM వసఘన్ పేర్కొన్నట్టు ‘Live Mint’ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.   

‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తీసుకెళ్ళిన ఘటనకు సంబంధించి RM వసఘన్ పబ్లిష్ చేసిన అధికారిక పేపర్‌ని ఇక్కడ చూడవచ్చు. ఓపెన్ ఫీల్డ్‌లో యాంటెన్నా పరీక్ష నిర్వహించడం కోసం ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తీసుకెళ్ళినట్టు ఈ పేపర్‌లో RM వసఘన్ స్పష్టంగా తెలిపారు. నిధుల కొరత కారణంగా యాపిల్ శాటిలైట్‌ని ఎడ్ల బండి పై తరలించినట్టు ఇస్రో సంస్థ ఎక్కడా ప్రకటించలేదు. భారత ప్రభుత్వ అధికారిక పత్రాలలో కూడా ఈ సంఘటన గురించి తెలిపిన ఇవే వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

ఇందిరా గాంధీ 1977లో తన మనవడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకని చార్టెడ్ విమానంలో జరిపించిన మాట వాస్తవం. కాని, ఈ వేడుకల సమయంలో ఇందిరా గాంధీ భారత ప్రధాని కాదు. రాహుల్ గాంధీ పుట్టిన రోజు జూన్ నెల 19వ తారీకు. 19 జూన్ 1977లో భారత ప్రధానమంత్రిగా ఉన్నది మొరార్జీ దేశాయ్.

చివరగా, ఇస్రో సంస్థ ‘APPLE’ శాటిలైట్‌ని ఎడ్లబండి పై తరలించింది ఓపెన్ ఫీల్డ్‌లో యాంటెన్నా పరీక్ష నిర్వహించడానికి, నిధుల కొరత వలన కాదు.

Share.

About Author

Comments are closed.

scroll