Fake News, Telugu
 

కోవిడ్ వాక్సిన్ తీసుకున్న పదిహేను రోజులలోపు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుందన్న వార్తకి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

‘కోవిడ్ వాక్సిన్ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల వరకి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందని, అందుకే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని’ చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఇదే వీడియోని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోలో చెప్తున్నా దానిలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్ వాక్సిన్ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల లోపు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందని, అందుకే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని’ చెప్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): అమెరికాకి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెప్తున్నదాని ప్రకారం వాక్సిన్ తీసుకున్న పదిహేను రోజుల లోపే టెస్ట్ పాజిటివ్ వస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాకపోతే సాధారణంగా వాక్సిన్ తీసుకున్న తరవాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి రెండు వారాలు పడుతుంది. ఒకవేళ వాక్సిన్ తీసుకోక ముందు గాని లేక వాక్సిన్ తీసుకున్న వెంటనే (ఇంకా రోగనిరోధక శక్తి డెవలప్ కాకముందు) ఒక వ్యక్తి వైరస్ బారినపడే అవకాశం ఉందని, దీనికి కారణం వాక్సిన్ రోగనిరోధక శక్తి డెవలప్ చేయడానికి తగిన సమయం దొరకలేదని అర్ధం.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అసలు కోవిడ్-19 టీకా ఎలా పని చేస్తుంది, దాని ప్రభావం ఏమిటి?

కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క ప్రభావాన్ని పరిశోధిస్తున్న అమెరికాకి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెప్తున్నదాని ప్రకారం వాస్తవిక పరిస్థుతులలో టీకా పనితీరుని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వైరస్ యొక్క వేరియంట్స్, వాక్సిన్ డోస్ తీసుకొనే షెడ్యూల్, వాక్సిన్ స్టోరింగ్, హ్యాండ్లింగ్ వంటి పలు కారణాలను CDC పేర్కొంది.

CDC వెబ్సైటు లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కోవిడ్ వాక్సిన్ తీసుకున్న తరవాత వాక్సిన్ తీసుకున్న చేతిలో నొప్పి, వాక్సిన్ తీసుకున్న ప్రదేశం ఎరుపు రంగులోకి మారడం లేదా వాపు ఉండడం, అలాగే అలసట, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, జ్వరం మరియు వికారంగా ఉండటం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందని, ఐతే ఇలా జరగడం సాధారణమేనని, పైగా శరీరం COVID-19 కు కారణమయ్యే వైరస్ నుండి రక్షణను పెంచుతున్నట్లు సంకేతం అని తెలిపింది.

వాక్సిన్ తీసుకున్న వారు వైరస్ బారిన పడే అవకాశం ఉందా?

సాధారణంగా వాక్సిన్ యొక్క నిర్ధారిత డోసులన్నీ తీసుకున్న తరవాత శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందడానికి రెండు వారాల సమయం పడుతుంది. ఒకవేళ వాక్సిన్ తీసుకున్న వెంటనే (ఇంకా రోగనిరోధక శక్తి డెవలప్ కాకముందు) ఒక వ్యక్తి వైరస్ బారినపడే అవకాశం ఉందని, దీనికి కారణం వాక్సిన్ రోగనిరోధక శక్తి డెవలప్ చేయడానికి తగిన సమయం దొరకలేదని అర్ధం అని ఈ వెబ్సైటులో పేర్కొన్నారు.

ఐతే వాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత గానీ చనిపోవటం గాని తక్కువే. వాక్సిన్ తీసుకున్న వారు మళ్ళీ కరోనాకి గురయ్యే అవకాశం చాలా తక్కువ అయినప్పటికీ, ఏ వాక్సిన్ కూడా వ్యాది భారిన పడకుండా వంద శాతం నిరోదించలేదని, వాక్సిన్ తీసుకున్న వారిలో కొద్ది శాతం మందికి COVID-19కి కారణమైన వైరస్‌ బారిన పడే అవకాశం ఉందని, వీటిని “వాక్సిన్ బ్రేక్త్రు కేసులు” అంటారని పేర్కొన్నారు. ఐతే ఇది సాదారణమేనని ఈ సమాచరంలో ఉంది.

వాక్సిన్ తీసుకున్న వారికి 15 రోజుల లోపు టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ వస్తుందా?

వాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పదిహేను రోజుల లోపు టెస్ట్ చేస్తే కచ్చితంగా పాజిటివ్ వస్తుందని CDC ఎక్కడా కూడా పేర్కొనలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా వాక్సిన్ తీసుకున్న పదిహేను రోజుల లోపు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందని ఎక్కడ కూడా పేర్కొనలేదు. దీన్నిబట్టి, పోస్టులోని వీడియోలో చెప్తున్న విషయానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవని అర్ధం చేసుకోవచ్చు.

సాధారణంగా కోవిడ్ టీకా తీసుకున్నవారు మళ్ళి PCR లేదా యాంటిజెన్ టెస్ట్ చేపించినప్పుడు పాజిటివ్ రాదనీ, ఎందుకంటే ఈ టెస్ట్స్ కేవలం మన శరీరంలో వైరస్ ఉందొ లేదో మాత్రమే తేలుస్తుందని, అదే యాంటీబాడీ టెస్ట్ లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఈ వెబ్సైటులో పేర్కొన్నారు. దీనికి కారణం యాంటీబాడీ టెస్ట్ కేవలం శరీరంలోని కోవిడ్ -19 రోగనిరోధక శక్తిని కొలుస్తుంది. వాక్సిన్ తీసుకున్న తరవాత రోగనిరోధక శక్తి పెంపొందుతుంది కాబట్టి యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్ కి సంబంధించిన సమాచారంలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ఇటీవల కాలంలో దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, కోవిడ్ వాక్సిన్ తీసుకున్న పదిహేను రోజులలోపు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వస్తుందన్న వార్తకి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll