Fake News, Telugu
 

రాజకీయ నాయకుల పెన్షన్‌పై ఇటీవల ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదు; 2018లోనే ఈ అంశంలో దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది

0

రాజకీయ నాయకుల పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. రాజకీయ నాయకులకు ఎందుకు పెన్షన్‌ రాకూడదో అన్న విషయంపై తమ అభిప్రాయాన్ని ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ అంశానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రాజకీయ నాయకుల పెన్షన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఫాక్ట్(నిజం):  ఎంపీలకు జీతాలు, పెన్షన్‌లు మరియు ఇతర ప్రోత్సాహకాలు చట్టబద్దమైనవే అంటూ ఇదే అంశంపై  దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు గతంలోనే కొట్టేసింది. 2022లో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఆ తరవాత మళ్ళీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల జీతాలు/పెన్షన్‌పై ఎటువంటి పిటిషన్ దాఖలైనట్టు ఎటువంటి సమాచారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 106 ప్రకారం, ఎంపీలకు జీతాలు మరియు ఇతర అలవెన్సులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు అందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఎంపీలకు జీతాలు మరియు ఇతర ప్రోత్సాహకాలకు సంబంధించి మన దేశంలో అమలులో ఉన్న చట్టాల గురించి చూద్దాం.

The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954:

రాజ్యాంగంలోని ఆర్టికల్ 106, ఎంపీలకు జీతాలు మరియు ఇతర అలవెన్సులకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు అందించింది. దీనికి అనుగుణంగా The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954  చట్టాన్ని చేసారు.

1954లో చేసిన ఈ చట్టంలో జీతాలు మరియు ఇతర అలవెన్సుల గురించి ప్రస్తావించారు తప్ప, ఈ చట్టంలో ఎంపీలకు పెన్షన్‌కు అందించే అంశంపై ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఐతే 1976లో ఈ చట్టానికి చేసిన సవరణ ద్వారా మొదటిసారి మాజీ ఎంపీలకు పెన్షన్ అందించారు.

ఆ తరవాత కూడా ఈ చట్టానికి చాలా సార్లు సవరణలు చేసారు. 2018లో, ఎంపీల జీతాలు మరియు ఇతర ప్రోత్సాహకాలు ప్రతీ ఐదు ఏళ్ళకు ఒకసారి పెరిగేలా (ద్రవ్యోల్బణం ఆధారంగా) సవరణలు చేసారు. అంతకు ముందువరకు కాలానుగుణంగా ఎంపీల జీతాలను సవరిస్తూ పార్లమెంట్ చట్టాలను చేసేది. కరోనా సమయంలో 2020లో ఎంపీల జీతాలు తగ్గిస్తూ ఒక ఆర్దినన్స్ తీసుకొచ్చారు.

ఎంపీల పెన్షన్‌లు రద్దు చేయాలని 2017లో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది:

ఎంపీలకు జీతాలు మరియు ఇతర ప్రోత్సాహకాలు అందించే విషయానికి సంబంధించిన The Salary, Allowances and Pension of Members of Parliament Act, 1954 చట్టానికి గతంలో చేసిన కొన్ని సవరణల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ 2017లో ‘లోక్ ప్రహరి’ అనే స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది.

పదవీ విరమణ తర్వాత కూడా ఎంపీలకు పెన్షన్ మరియు ఇతర ప్రోత్సాహకాలు అందించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధం అంటూ మరియు ఎలాంటి చట్టం చేయకుండా చట్టసభల సభ్యులకు పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను అందించే అధికారం పార్లమెంటుకు లేదని కూడా పిటిషన్‌లో పేర్కొంది.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయన్ని అడగగా, ‘పదవీకాలం పూర్తయిన తర్వాత కూడా వారి గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నందున మాజీ పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) పెన్షన్ మరియు ఇతర ప్రయోజనాలను పొందే అర్హత న్యాయబద్ధమే అని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.’

ఈ పిల్‌లో ప్రస్తావించిన చట్టాల  రాజ్యాంగబద్ధతను పరిశీలించిన సుప్రీంకోర్టు, ఈ పిల్‌ను 2018లో కొట్టేసింది. మాజీ ఎంపీలకు పెన్షన్ అందించే విషయంలో చట్టాలు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉందని, గతంలో Common Cause, A Registered Society vs. Union of India కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ పిల్‌ను కొట్టేసింది.

2022లో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇలాంటి వ్యాజ్యాన్ని కొట్టేసింది:

కనీసం ఐదు ఏళ్లు ఎంపీ/ఎమ్మెల్యేలగా పనిచేసిన వారికి మాత్రమే జీవితకాల పెన్షన్‌ అందించేలా మధ్యప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2022లో దాఖలైన వ్యాజ్యాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

ఐతే ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన కోర్టు, దాంట్లో లేవనెత్తిన అంశాలపైన సుప్రీంకోర్టు గతంలోనే (పైన ప్రస్తావించిన 2018, లోక్ ప్రహారి పిల్) ప్రతికూలమైన తీర్పు ఇచ్చిందని తెలుపుతూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఆ తరవాత మళ్ళీ ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల జీతాలు/పెన్షన్‌పై ఎటువంటి పిటిషన్ దాఖలైనట్టు ఎటువంటి సమాచారం లేదు. పోస్టులో చెప్తున్నది 2018 దాఖలైన పిల్ గురించి అయ్యుండొచ్చు. దీనినే తప్పుగా అర్ధం చేసుకొని ఇప్పుడు షేర్ చేసి ఉండవచ్చు.

చివరగా, ఎంపీల పెన్షన్‌ అంశంలో ఇటీవల ఎటువంటి పిటిషన్ దాఖలు కాలేదు. 2018లోనే ఈ అంశంలో దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది.

Share.

About Author

Comments are closed.

scroll