Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోని పాకిస్థాన్ ప్రజలు ఇప్పుడు తమ పిల్లలని గాడిద బండ్లపైన పాఠశాలలకు పంపుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

వాహనాలకు పెట్రోల్ లేక తమ పిల్లలను గాడిద బండ్ల మీద పాఠశాలలకు పంపిస్తున్న పాకిస్తాన్ ప్రజలు, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేందుకు ఇటీవల ఇంధన ధరలను భారీగా పెంచిన నేపథ్యంలో, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్ ప్రజలు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేందుకు తమ పిల్లలను గాడిద బండ్ల మీద పాఠశాలలకు పంపిస్తున్న దృశ్యం.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటోని 2009లో పాకిస్థాన్ రాజధాని లాహోర్ నగరంలోని  చారిత్రాత్మక బద్‌షాహి మసీదు ఎదుట తీశారు. మసీదుని వీక్షించడానికి వచ్చిన చిన్న పిల్లల వినోదం కోసం ఒక వ్యాపారి ఈ గాడిద బండిని మసీదు ఎదుట నడిపేవాడని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఫోటోకి పాకిస్థాన్ ప్రస్తుత ఆర్ధిక సంక్షోభానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Pakisthan Bee’ అనే వెబ్సైట్ 2009 నవంబర్ నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పాకిస్థాన్ రాజధాని లాహోర్ నగరంలోని చారిత్రాత్మక బద్‌షాహి మసీదు ఎదుట చిన్న పిల్లల వినోదం కోసం అమర్చబడిన గాడిద బండి దృశ్యమని ఫోటోని షేర్ చేస్తూ ఈ వెబ్సైట్ తెలిపింది. మసీదుని వీక్షించడానికి వచ్చిన చిన్న పిల్లల వినోదం కోసం ఒక వ్యాపారి ఈ గాడిద బండిని మసీదు ఎదుట నడిపేవాడని ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు. ఇదే ఫోటోని షేర్ చేస్తూ గతంలో కూడా చాలా మంది సోషల్ మీడియా యూసర్లు పోస్టులు పెట్టారు.

పాకిస్థాన్‌లో ఇటీవల నెలకొన్న ఆర్ధిక సంక్షోభం కన్నా ముందు కూడా ఆ దేశ ప్రజలు రవాణా కార్యకలాపాల కోసం గుర్రాల బండ్లను, గాడిద బండ్లను ఉపయోగించినట్టు ఆధారాలు ఉన్నాయి.

2022 జూన్ నెలలో, పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో (CAA) పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచడంతో తాను వ్యక్తిగత రవణాను వినియోగించుకోలేకపోతున్నానని, పనికి గాడిద బండి మీద వచ్చేందుకు అనుమతిని ఇవ్వాలని తన పైఅధికారికి లేఖ రాసినట్టు పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. కానీ, పాకిస్థాన్ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు తమ పిల్లలని గాడిదల బండ్లపైన పాఠశాలలకు పంపుతున్నట్టు ఇటీవల ఎక్కడా రిపోర్ట్ కాలేదు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోని షేర్ చేస్తూ పాకిస్థాన్ ప్రజలు తమ పిల్లలని గాడిద బండ్లపైన పాఠశాలలకు పంపుతున్న చిత్రమని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll