Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ సిక్కు వేషం ధరించి రైతు ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం అని షేర్ చేస్తున్నారు.

0

సిక్కు రైతు వేషం ధరించిన ముస్లిం తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లులని వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న నేపధ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: సిక్కు వేషం ధరించి రైతు ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. వీడియోలో కనిపిస్తున్న ఆ ఘటన 2011లో మొహాలీ స్టేడియం సమీపంలో జరిగింది. జిల్లా పరిషత్ వెటర్నరీ ఫార్మాసిస్టులు తమ ఉద్యోగాలని రెగులరైజ్ చేయాలని చేసిన ఉద్యమంలో, ఇద్దరు పోలీసులు ఒక ఫార్మసిష్టు తల పాగాని ఇలా బలవంతంగా లాగారు. ఆ వీడియోకి ఇటివల రైతులు వ్యవసాయ బిల్లులకి సంబంధించి చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని 2011లో ఒక యూసర్  తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. “Insult of Turban (Sikh’s Identity) @ Mohali Stadium by a Punjab Police Officer” అనే టైటిల్ తో ఈ వీడియోని ఆ యూసర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసారు.

ఈ వివరాల ఆధారంగా ఆ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఘటనకు సంబంధించి పబ్లిష్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ దొరికాయి. ఒక ఆర్టికల్ వివరణలో, జిల్లా పరిషత్ వెటర్నరీ ఫార్మాసిస్టులు తమ ఉద్యోగాలని రెగులరైజ్ చేయాలనీ చేసిన ఉద్యమంలో, ఇద్దరు పోలీసులు ఒక  ఫార్మసిష్టు తల పాగాని బలవంతంగా లాగినట్టు పేర్కొన్నారు. ఈ ఘటన 2011లో మొహాలిలో జరిగినట్టు ఆర్టికల్ లో తెలిపారు. సిక్కులు గౌరవంగా బావించే తలపాగాను అవమానించినందుకు, ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు మరొక ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ముస్లిం కాదు,  సిక్కు మతానికి చెందిన వ్యక్తే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఇదే వీడియోని CAA ఉద్యమాలకి జతచేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని చూపిస్తూ సిక్కు వేషం ధరించి రైతు ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll