Fake News, Telugu
 

2020 తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలలో పెద్దగా తేడా లేదు

0

2020లోని పలు నిత్యావసర వస్తువుల ధరలని 2021 ధరలతో పోల్చుతూ, 2021లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి.

ఫాక్ట్ (నిజం): నిజానికి 2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలలో పెద్దగా పెరగలేదు. 2020లోని ధరలతో పోల్చినప్పుడు 2021లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, కాకపోతే 2020 మరియు 2021 ధరలకు పెద్ద తేడా ఐతే ఏమి లేదు. ఈ పోస్టులో 2021వ సంవత్సరానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల ధరలు చాలా ఎక్కువ చేసి చూపించారు, అలానే 2020లోని ధరలను తక్కువ చేసి చూపించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

దేశంలో నిత్యావసర వస్తువుల కొరత రాకుండా మరియు నిత్యావసరాల వస్తువుల ధరలు నియంత్రణలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫైర్స్ లోని ప్రైస్ మోనిటరింగ్ డివిజన్ దేశం లోని 115 మార్కెట్ సెంటర్లలో బియ్యం,చెక్కర, నూనే, పలు రకాల పప్పులు మొదలైన 22 నిత్యావసరాల వస్తువుల రోజువారి రిటైల్ మరియు హోల్ సేల్ ధరలను మానిటర్ చేస్తుంది. ఈ వెబ్సైటులో నుండి 2020 సంవత్సరంలో దేశంలోని అన్ని మార్కెట్ సెంటర్లలోని నెల చివరి ధరలను సేకరించి వాటి  సగటును లెక్కించాము, ఇంకా 2021లో జనవరి నెల చివరి ధరలను సేకరించి వాటి  సగటును లెక్కించాము. ధరలు సమాచారం కింది టేబుల్ లో చూడొచ్చు. ఐతే కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేసే నిత్యావసరాల వస్తువులలో చింతపండు మరియు కారం లేవు. కావున వీటికి సంబంధించిన ధరలు ఇందులో ప్రస్తావించలేదు.

2020లోని ధరలతో పోల్చినప్పుడు 2021లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, కాకపోతే 2020 మరియు 2021 ధరలకు పెద్ద వ్యత్యాసం ఐతే ఏమి లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం నిత్యావసర వస్తువుల ధరలు ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి.

2021కి సంబంధించి పోస్టులో చెప్తున్న ధరలకి, ఆ సంవత్సరంలోని అసలు ధరలకి చాలా వ్యత్యాసం ఉంది. పోస్టులో 2021 ధరలను చాలా ఎక్కువ చేసి చూపించారు. ఉదాహరణకి 2021లో kg సెనగ పప్పు ధర రూ. 70 కాగా పోస్టులో మాత్రం దీనిని రూ. 140గా చూపించారు, 2021లో kg గోధుమ పిండి ధర రూ.30 కాగా పోస్టులో మాత్రం దీనిని రూ. 55గా చూపించారు. అదేవిధంగా 2020 ధరలు కొంచెం తక్కువ చేసి చూపించినప్పటికీ  ఒక మూడు వస్తువులు (కండి పప్పు, పెసరు పప్పు, బెల్లం) తప్ప మిగతా వాటి అసలు ధరలకి, పోస్టులో చెప్తున్న ధరలకి పెద్ద వ్యత్యాసం లేదు. వీటన్నిటి బట్టి పోస్టులో తమకు అనుకూలంగా 2021లో నిత్యావసర ధరలను పెంచి మరియు 2020లోని ధరలను తగ్గించి పోల్చినట్టు అర్ధమవుతుంది.

చివరగా, 2020 తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll