భారతదేశం మరో 72 గంటలలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని చుడబోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసర్చ్ (ICMR) హెచ్చరించినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ వలన భారతదేశం తీవ్ర ప్రాణ నష్టాన్ని ఎదుర్కోబోతున్నట్టు ఈ పోస్టులో తెలిపారు. నలభై (40) వయస్సు పై బడిన వారు కరోనా వైరస్‌ని ఎదుర్కొనేందుకు, ఏడు సూత్రాలతో కూడిన ఆరోగ్య జాగ్రత్తలని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతదేశం 72 గంటలలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని చుడబోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ICMR హెచ్చరించింది.
ఫాక్ట్ (నిజం): భారతదేశం 72 గంటలలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని చుడబోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. భారతదేశం కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని ఎదుర్కోబోతుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ICMR, కరోనా సెకండ్ వేవ్‌తో పోల్చినంత తీవ్ర స్థాయిలో ‘థర్డ్ వేవ్’ ఉండబోదని ఆ నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ 2021 చివరి నెలలో విస్తరిస్తుందని ICMR తమ నివేదికలో తెలిపింది. నలభై (40) వయస్సు పై బడిన వారు తీసుకోవలిసిన జగ్రత్తలంటూ షేర్ చేసిన పోస్టులోని మెసేజ్ నవంబర్ 2019 (భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకముందు) నుంచి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కు సంబంధించిన వివరాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెబ్సైటులో వెతకగా, భారతదేశం కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని 72 గంటలలో చూడబోతుందని తెలుపుతూ WHO ఎటువంటి హెచ్చరిక జారి చేయలేదని తెలిసింది. ఒకవేళ WHO భారత ప్రభుత్వానికి అటువంటి హెచ్చరిక జారీ చేసి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు న్యూస్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. కానీ, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఏ ఒక్క న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవలేదు. భారత దేశంలో కరోనా వైరస్ ఉద్రిక్తతని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పలు ప్రసంగాలలో వివరించారు. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, భారతదేశం 72 గంటలలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని చూడబోతుందని టెడ్రోస్ ఎక్కడా ప్రకటించలేదు.
భారత దేశంలో కరోనా ‘థర్డ్ వేవ్’ విస్తృతి పై ICMR పరిశోధకులు అధ్యయనం చేసి ఇటీవల భారత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినట్టు పలు న్యూస్ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. భారతదేశంలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ తప్పకుండా విస్తరిస్తుందని తెలిపిన ICMR, కరోనా సెకండ్ వేవ్‌తో పోల్చినంత తీవ్ర స్థాయిలో ‘థర్డ్ వేవ్’ ఉండబోదని నివేదికలో స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ 2021 చివరి నెలలలో వ్యాప్తి చెందబోతుందని ICMR పరిశోధకులు తమ నివేదికలో తెలిపారు. థర్డ్ వేవ్‌ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటినుంచే ప్రణాళిక సిద్దం చేసుకోవాలని ICMR అధికారి బలరాం భార్గవ మీడియా సమావేశంలో తెలిపారు. భారత దేశం కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని 72 గంటలలో చుడబోతుందని తెలుపుతూ ICMR ఎటువంటి ప్రకటన చేయలేదు.
భారత దేశం కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ చూడటం అనివార్యమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఇటీవల భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను తప్పక అమలు చేయాలని IMA సూచించింది. కరోనా ‘థర్డ్ వేవ్’ ముంచుకొస్తున్న పరిస్థితుల్లో తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలని ఇప్పుడప్పుడే తెరవకూడదని IMA కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
కరోనా వైరస్ నేపథ్యంలో, నలభై (40) ఏళ్ళు పైబడిన వారు తీసుకోవలిసిన జాగ్రత్తలంటూ షేర్ చేసిన పోస్టులోని మెసేజ్, నవంబర్ 2019 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. అంటే, భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందు నుంచి ఈ మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు స్పష్టమయ్యింది. ఈ మెసేజ్ లో తెలిపిన కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు WHO హెల్త్ డైట్ సెక్షన్‌లో కూడా తెలిపారు. కానీ, అవి నలభై (40) ఏళ్ళు పైబడిన వారి కోసం అని ప్రత్యేకంగా తెలుపలేదు.
చివరగా, భారతదేశం మరో 72 గంటలలో కరోనా వైరస్ ‘థర్డ్ వేవ్’ని చుడబోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లేదా ICMR భారతదేశాన్ని హెచ్చరించలేదు.