Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని ముస్లిం మహిళ చేత మధ్యప్రదేశ్ పోలీసులు గుంజీలు తీయిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్ పోలీసులు బుల్ డోజర్లపై రాళ్ళు రువ్విన ముస్లిం మహిళ చేత గుంజీలు తీయిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: బుల్ డోజర్లపై రాళ్ళు రువ్విన ముస్లిం మహిళ చేత మధ్యప్రదేశ్ పోలీసులు గుంజీలు తీయిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2020 ఏప్రిల్ నెలలో లాక్‌డౌన్ ఉల్లఘించినందుకు గానూ పోలీసులు ఈ ముస్లిం మహిళ చేత గుంజీలు తీయించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలోని సలబాట్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని 2020 ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ, చూడవచ్చు. లాక్‌డౌన్ నియమాలని ఉల్లఘించినందుకు గాను పోలీసులు ఒక మహిళ చేత గుంజీలు తీయిస్తున్న దృశ్యాలని యూసర్లు వీడియో వివరణలో తెలిపారు.

ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘కనెక్ట్ గుజరాత్’ అనే స్థానిక న్యూస్ ఛానల్ 16 ఏప్రిల్ 2020 నాడు తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలోని సలబాట్పూర్ గ్రామంలో లాక్‌డౌన్ నియమాలని ఉల్లంఘించిన ఒక మహిళను పోలీసులు గుంజీలు తీయిస్తున్న దృశ్యాలని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతదని మరియు ఇటీవల మధ్యప్రదేశ్లో రాళ్లు రువ్విన ఘటనకి సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని మధ్యప్రదేశ్లో బుల్ డోజర్లపై రాళ్ళు రువ్విన ముస్లిం మహిళను పోలీసులు గుంజీలు తీయిస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll