Fake News, Telugu
 

నాసిక్‌లో నీటిలో పడేసి చంపబడిన నాలుగేళ్ల బాలుడు ముస్లిం, హిందువు కాదు

0

మహారాష్ట్రలోని నాసిక్‌లో నాలుగేళ్ల హిందూ బాలుడిని ఒక ముస్లిం యువకుడు నీటిలో పడేసి చంపేశాడని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: నాసిక్‌లో నాలుగేళ్ల హిందూ బాలుడిని ఒక ముస్లిం యువకుడు నీటిలో పడేసి చంపాడు.

ఫాక్ట్: నాసిక్‌లో జరిగిన ఈ సంఘటనలో చనిపోయిన బాలుడు హసన్ మాలిక్ హుస్సేన్ ముస్లిం మతానికి చెందినవాడు. బాలుడి తల్లిదండ్రుల పేర్లు రుమానా కౌశర్, ముబ్బషీర్ అని, బాలుడి మేనమామ సల్మాన్ అహ్మద్ మహమ్మద్ రంజాన్ FIRలో పేర్కొన్నాడు. అలాగే, బాలుడిని నీటిలోకి తోసేసిన గుర్తు తెలియని యువకుడు ముస్లిం టోపీ పెట్టుకొని ఉన్నట్లుగా FIRలో నమోదైంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన అనేక మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని మాలెగావ్ పట్టణంలో 05 మార్చి 2024న జరిగింది. హసన్ మాలిక్ హుస్సేన్ అనే నాలుగేళ్ల ముస్లిం బాలుడు మాలెగావ్‌లోని తన బంధువుల ఇంటి వద్ద ఆడుకుంటుండగా ఒక గుర్తు తెలియని యువకుడు బాలుడిని మురుగునీటి గుంటలో వేసి పారిపోయాడు.

ఈ ఘటనకి సంబంధించి పవార్‌వాడి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన FIRలో చనిపోయిన బాలుడి తల్లిదండ్రుల పేర్లు రుమానా కౌశర్ మరియు ముబ్బషీర్ అని బాలుడి మేనమామ సల్మాన్ అహ్మద్ మహమ్మద్ రంజాన్ పేర్కొన్నారు. అలాగే బాలుడిని నీటిలోకి తోసేసిన గుర్తు తెలియని యువకుడు ముస్లిం టోపీ పెట్టుకొని ఉన్నట్లుగా సీసీ టీవీలో చూశామని సల్మాన్ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. IPC సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిండుతుడి కోసం గాలిస్తున్నారు.

బాలుడి బంధువులు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు. పై ఆధారాలను బట్టి చనిపోయిన బాలుడు హిందువు కాదని నిర్దారించవచ్చు.

చివరిగా, నాసిక్‌లో జరిగిన బాలుడి హత్యకి మతపరమైన కోణాన్ని జోడిస్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll