Fake News, Telugu
 

పెరియార్ అశ్లీలతను సమర్థించారని ఆరోపిస్తున్న ఈ వైరల్ క్లెయిమ్ తప్పు

0

ప్రఖ్యాత భారతీయ సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త అయిన పెరియార్ రామస్వామి, పురుషులను తమ తల్లులు, సోదరీమణులతో లైంగిక సంబంధం పెట్టుకోమని ప్రోత్సహించారని ఆరోపిస్తున్న వాదన సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఈ ఆరోపణకి రుజువుగా పెరియార్ స్థాపించిన ‘విదుతలై’ వార్తాపత్రికలో 11 మే 1953 న దీని గురించి రాసి ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్లెయిమ్ యొక్క విశ్వసనీయతను ఈ కథనం ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: సెక్స్ కోసం ఆతృతగా ఉన్న పరిస్థితుల్లో తమ తల్లులు మరియు సోదరీమణులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని పెరియార్ రామస్వామి 11 మే 1953 న ‘విదుతలై’ పత్రికలో పురుషులకు సూచించారు.

ఫాక్ట్(నిజం):  ‘విడుతలై’ పత్రిక తమ వెబ్సైటులో ఒక కథనం ద్వారా ఈ క్లెయిమ్ అవాస్తవం అని తేల్చి చెప్పింది. వైరల్ పోస్ట్‌లలో చేసిన వాదనలకు మద్దతు ఇవ్వడానికి 11 మే 1953 ‘విడుతలై’ పత్రికలో ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతను ధృవీకరించడానికి, మేము మొదట ఇంటర్నెట్ కీ వర్డ్ శోధనను చేసాం, అది విదుతలై వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒక కథనానికి దారితీసింది. ఈ కథనం వైరల్ అవుతున్న క్లైముని ఖండించింది, ఇది చెడు ఉద్దేశ్యంతో ప్రచారం చేయబడిన అబద్దం అని లేబుల్ చేసింది.

కొందరు పెరియార్ అనుచరులు 11 మే 1953 నాటి విడుతలై వార్తాపత్రిక కాపీలను పొందారని కథనం పేర్కొంది. వైరల్ పోస్ట్‌లలో చేసిన ఆరోపణలకు విరుద్ధంగా, పెరియార్ పురుషులు తమ తల్లులు మరియు సోదరీమణులతో లైంగిక సంబంధం కలిగి ఉండమని సూచించినట్లు ఎటువంటి సమాచారం లేదని ఈ కథనంలో విడుతలై పేర్కొనింది.

దీన్ని ధృవీకరించడానికి, మేము మరొక ఇంటర్నెట్ శోధన చేయగా, ఆసిఫ్ అనే ఒక యూసర్ చేసిన ట్వీట్‌ దొరికింది. ఈ ట్వీట్‌లో 11 మే 1953న విడుదలైన విడుతలై వార్తాపత్రికలోని పేజీల చిత్రాలు ఉన్నాయి.

ఫ్యాక్ట్-చెకింగ్ వెబ్‌సైట్ ఫ్యాక్ట్-క్రెసెండో తమిళ్, ఈ క్లెయిమ్ తప్పు అని ధృవీకరించడానికి సాక్ష్యంగా ఆసిఫ్ ట్వీట్‌ను వారు రాసిన ఫాక్ట్ చెక్ కథనంలో ఉపయోగించారు. “ఈ పేజీలలో ఎక్కడా పెరియార్ అటువంటి సూచనలు చేసినట్లు సమాచారం లేదు” అని వారి కథనంలో ఫ్యాక్ట్-క్రెసెండో తమిళ్ పేర్కొనింది.

చివరిగా, పురుషులు తమ తల్లులు మరియు సోదరీమణులతో  లైంగిక సంబంధం పెట్టుకోవాలని పెరియార్ చెప్పారు అనే వాదన తప్పు. వైరల్ పోస్ట్‌లలో చేసిన ఆరోపణలలో వాస్తవం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll