Fake News, Telugu
 

కాలంలో ఒక రోజు మిస్ అయిందన్న వాదనకి ఎటువంటి శాస్త్రీయత లేదు; బైబిల్‌లో చెప్పిందంతా నిజమని NASA గుర్తించిందన్న వాదన తప్పు

0

NASA శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలలో భాగంగా కాలంలో ఒక రోజు మిస్ అవ్వడం గుర్తించారని, తద్వారా దేవుడు ఒక సందర్భంలో సూర్యుడిని నిశ్చలంగా ఉంచాడని, మరొక సందర్భంలో సూర్యుడిని పది డిగ్రీలు వెనుకకు వెళ్లేలా చేసాడని బైబిల్‌లో పేర్కొన్న కథనాలను నిజమని సూచిస్తుందని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: NASA కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని గుర్తించింది, తద్వారా బైబిల్‌లో పేర్కొన్న కొన్ని విషయాలు నిజమని రుజువు అయింది.

ఫాక్ట్ (నిజం): బైబిల్‌లో చెప్పినట్టు సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని NASA పేర్కొంది. అలాగే కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని NASA గాని లేక ఏ ఇతర పరిశోధన సంస్థగాని గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఈ వార్త NASAను స్థాపించక ముందు నుండి ప్రచారంలో ఉంది, దీనికి ఎటువంటి శాస్త్రీయత లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని NASA గాని లేక ఏ ఇతర పరిశోధన సంస్థగాని గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. అదేవిధంగా బైబిల్‌లో చెప్పినట్టు సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడనడానికి  లేక పది డిగ్రీలు వెనక్కి వెళ్ళాడనడానికి కూడా ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

1997లో NASA ఈ కథానానికి స్పందిస్తూ, భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడనడానికి  రెండే వివరణలు ఉన్నాయని, 1) భూమి తన ఆక్సిస్ మీద తిరగడం ఆపేసినప్పుడు లేదా 2)  భూమిపై ఉన్న మనకు నిశ్చలంగా ఉన్నాడని అనిపించించేలా సూర్యుడు సౌర వ్యవస్థలో నిర్దిష్టమైన పద్దతిలో తిరగిన సందర్భంలో.

ఐతే ఈ రెండు పరిణామాలు జరిగినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, కాబట్టి సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడన్న వాదనకి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని NASA స్పష్టం చేసింది. అలాగే బైబిల్‌లో చెప్పిన అన్ని విషయాలు నిజంగా జరిగినట్టు శాస్త్రీయ రుజువు చేయడం సాధ్యం కాదని కూడా NASA తెలిపింది. ఇలా సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడన్న ఈ కథనం NASA ఏర్పాటు కాకముందు నుండి ప్రచారంలో ఉందని తెలిపింది.

గతంలో ఇదే వార్త వైరల్ అయినప్పుడు హ్యారీ రిమ్మర్ అనే ఒక రచయిత ‘ది హార్మొనీ ఆఫ్ సైన్స్ అండ్ స్క్రిప్చర్’ పుస్తకంలో ఇలాంటిదే ఒక కథ రాసినట్టు స్నోప్స్ అనే ఫాక్ట్-చెకింగ్ సంస్థ ఇదే క్లెయిమ్ తప్పని చెప్తూ రాసిన కథనంలో పేర్కొంది.

పోస్టులోనో పేపర్ క్లిప్‌లో NASA శాస్త్రవేత్తలు కాలంలో ఒక రోజు మిస్ అయిందని కనుగొన్నారన్న వాదనని హెరాల్డ్ హిల్ అనే స్పేస్ ప్రోగ్రాం కన్సల్టెంట్‌ చెప్పినట్టు రిపోర్ట్ చేయగా, మేరీల్యాండ్‌లోని NASA  కార్యాలయం హెరాల్డ్ హిల్ చెప్పిన దాన్ని కొట్టిపారేస్తూ ఒక ప్రకటన చేసిందని  స్నోప్స్ తమ కథనంలో పేర్కొంది.

పైన తెలిపిన ఆధారాల ప్రకారం బైబిల్ గురుంచి మద్దతుగా పోస్టులో చెప్పిన విషయాలకి శాస్త్రీయతలేదని స్పష్టమవుతుంది.

చివరగా, కాలంలో ఒక రోజు మిస్ అయిందన్న వాదనకి ఎటువంటి శాస్త్రీయత లేదు; బైబిల్‌లో చెప్పిందంతా నిజమని NASA గుర్తించిందన్న వాదన తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll