Fact Check, Fake News, Telugu
 

భారతీయ రైల్వేలో LHB రైల్వే కోచ్‌లను ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు

0

15 ఫిబ్రవరి 2023 నాడు విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన LHB రైల్వే కోచ్‌ల సంస్కరణ వలనే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. భారతీయ రైల్వేలో LHB కోచ్‌లను మొట్టమొదట నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతీయ రైల్వేలో LHB రైళ్ల కోచ్‌లను మొట్టమొదట నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే ప్రవేశపెట్టారు.

ఫాక్ట్ (నిజం): భారతీయ రైల్వేలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తక్కువ బరువు, అధిక వేగంతో వెల్లగలిగే రైల్వే కోచ్‌లను తయారుచేసేందుకు 1995లో జర్మనీకి చెందిన M/s Linke-Hoffman-Busch (LHB) కంపనీతో ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీ నుండి దిగుమతి అయిన మొట్టమొదటి 24 LHB కోచ్‌లను భారత ప్రభుత్వం 2001లో భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టింది. యూపిఏ ప్రభుత్వంలో 2004 నుండి 2014 మధ్య మొత్తంగా 2327 LHB కోచ్‌లను భారత రైల్వే శాఖ తయారుచేసిందని 2018లో జారీ చేసిన ప్రకటనలో భారత ప్రభుత్వం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాక ముందు చాలా సంవత్సరాల ముందు నుంచే భారతీయ రైల్వేలో LHB కోచ్‌లు వాడకంలో ఉన్నాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, జర్మనీ నుండి మొట్టమొదటి సారి దిగుమతి చేసిన 24 LHB కోచ్‌లను భారత ప్రభుత్వం 2001లో భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టినట్టు తెలిసింది. భారతీయ రైల్వేలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తక్కువ బరువు, అధిక వేగంతో వెల్లగలిగే రైల్వే కోచ్‌లను తయారుచేసేందుకు 1995లో జర్మనికి చెందిన M/s Linke-Hoffman-Busch (ప్రస్తుతం M/s Alstom LHB అని పేరు మార్చారు) కంపనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా జర్మనీ నుంచి దిగుమతి చేసిన LHB కోచ్‌లను మొట్టమొదట 2001లో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు అమర్చినట్టు తెలిసింది. 2001 రైల్వే బడ్జెట్లో LHB కోచ్‌ల దేశీయ తయారీ గురించి ప్రస్తావన ఉంది.

2001లో ప్రవేశపెట్టిన ఈ LHB కోచ్‌ల సంఖ్యను భారత రైల్వే శాఖ క్రమంగా పెంచుతూ వస్తుంది. యూపిఏ ప్రభుత్వ హయాంలో 2004 నుండి 2014 మధ్య మొత్తంగా 2327 కొత్త LHB కోచ్‌లను భారత రైల్వే శాఖ రూపొందించినట్టు 2018లో జారీ చేసిన ఒక ప్రకటనలో భారత రైల్వే మంత్రుత్వ శాఖ తెలిపింది.

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 2014 నుండి 2018 వరకు 5548 కొత్త LHB కోచ్‌లను తయారుచేసినట్టు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఇదే ప్రకటనలో స్పష్టం చేసింది. రైలు ప్రమాదాలలో ప్రాణనష్టం కలగకుండా ఉండేందుకు 2018-19 నుండి కన్వెన్షనల్ కోచ్‌లను అన్నిటినీ LHB కోచ్‌లతో భర్తీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు రైల్వే శాఖ అధికారులు పలు సార్లు తెలిపారు. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేశాయి. 2018-19 నుండి భారతీయ రైల్వే ప్రొడక్షన్ యూనిట్లలో కేవలం LHB కోచ్‌లను మాత్రమే రూపొందిస్తున్నట్టుపీయూష్ గోయల్ 2019లో పార్లమెంట్‌లో ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం రాక  ముందు చాలా సంవత్సరాల ముందు నుంచే భారతీయ రైల్వేలో LHB కోచ్‌లు వాడకంలో ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాక ముందు కూడా LHB కోచ్‌ల వాడకం వలన పెను రైలు ప్రమాదాలు తప్పినట్టు న్యూస్ రిపోర్టులు ఉన్నాయి.

చివరగా, భారతీయ రైల్వేలో LHB రైల్వే కోచ్‌లను నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. జర్మని నుండి దిగుమతి అయిన మొట్టమొదటి 24 LHB కోచ్‌లను భారత ప్రభుత్వం 2001లో భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టింది.

Share.

About Author

Comments are closed.

scroll