కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం బ్యాంకులు, సీపోర్టులు, ఎయిర్పోర్టులు, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలేవి నష్టాల్లో లేవని, మోదీ వచ్చిన తరవాతే ఈ సంస్థలు నష్టాల్లోకి పోయాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం బ్యాంకులు, సీపోర్టులు, ఎయిర్పోర్టులు, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలేవి నష్టాల్లో లేవు, మోదీ వచ్చిన తరవాతే ఈ సంస్థలు నష్టాల్లోకి పోయాయి.
ఫాక్ట్(నిజం): కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004-14 కాలంలో కూడా బ్యాంకులు, ఎయిర్పోర్టులు, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలను నమోదు చేసాయి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో వివిధ ప్రభుత్వ రాంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహారణ జరిగింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్తున్నదానికి వ్యతిరేకంగా చాలావరకు బ్యాంకులు, రైల్వే సంస్థలు, విమానాయాన సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా నష్టాలను నమోదు చేసాయి. దీనికి సంబంధించిన ఉదాహారణలు కొన్ని కింద చూద్దాం.
బ్యాంక్ NPAలు :
బ్యాంక్ NPA(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్)లు అనేవి ఇప్పుడు కొత్తగా ఏమీ రిపోర్ట్ కావట్లేదు. గత ప్రభుత్వాల పాలనలో కూడా ప్రభుత్వ రంగా బ్యాంకులు NPAలను నమోదు చేసాయి.
బ్యాంకుల NPAలకు సంబంధించి RBIలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చుస్తే మనకు ఈ విషయం అర్ధమవుతుంది. 2003-22 వరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు నమోదు చేసిన NPAల వివరాలు కింది టేబుల్‌లో చూడొచ్చు. ఈ సమాచారం ప్రకారం గత కాంగ్రెస్ ప్రభుత్వం (2004-14) వరకు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకులు NPAలను నమోదు చేసాయని స్పష్టమవుతుంది.
గతంతో పోలిస్తే ఈమధ్య కాలంలో NPAల విలువ ఎక్కువ ఉన్నప్పటికీ, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు నమోదయ్యే NPAలకు గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులు ఇచ్చిన రుణాలు కూడా కారణమయ్యే అవకాశం ఉంది.
BSNL నష్టాలు:
ప్రస్తుతం BSNL తీవ్ర అప్పులలో ఉన్న మాట నిజమైనప్పటికి, BSNL కేవలం మోదీ ప్రభుత్వ హయాంలోనే నష్టాల్లోకి వెళ్లిందన్న మాట నిజం కాదు. BSNL వార్షిక నివేధికల ప్రకారం 2009-10 సంవత్సరం నుండి BSNL నష్టాలు నమోదు చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.
ఇదే విషయం పార్లమెంట్‌లో పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది. 2009 నుండి BSNL మరియు MTNL నష్టాలూ పెరుగుతూ వచ్చాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
ఆయిల్ కంపెనీల నష్టాలు:
గత కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో అమలులో ఉన్న విధానంలో అంతర్జాతీయా మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు, పెరిగిన భారాన్ని వినియోగదారుల మీద పడకుండా ఆయిల్ కంపెనీలు సబ్సిడి ధరలకే ఇంధనాన్ని అందిచేవి. ఇలా చేయడం వల్ల ఆయిల్ కంపెనీలకు కలిగిన నష్టాలను అండర్-రికవరీస్ అని అంటారు. బడ్జెట్‌లో కేటాయింపు చేయడం, బాండ్స్ జారీ చేయడం ద్వారా అప్పటి ప్రభుత్వం ఈ అండర్-రికవరీస్‌ను పూర్చేవి.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ వార్షిక నివేధికల్లో ఈ అండర్-రికవరీస్‌కు సంబంధించిన వివరాలు చూడొచ్చు. 2002-14 కాలంలో ఎనిమిది లక్షలకు పైచిలుకు అండర్-రికవరీస్ నమోదయ్యాయి.
ఇందులో చాలావరకు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్ కంపెనీలకు అందించగా, కొంత ఆయిల్ బాండ్స్ జారీ చేయడం ద్వారా కంపెనీలకు చెల్లించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఈ బాండ్స్‌లో కొన్ని ఇంకా మెచ్యూర్ అవ్వాల్సి ఉన్నాయి. దీన్నిబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయిల్ కంపెనీలు నష్టాలలో నడిచాయని అర్ధం చేసుకోవచ్చు.
విమానయాన సంస్థల నష్టాలు:
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా విమానయాన రంగం నష్టాల్లో ఉండేది. ప్రభుత్వ మరియు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా నష్టాల్లో నడిచాయి.
ఇండియన్ ఎయిర్వేస్/ఎయిర్ ఇండియా సంస్థ వార్షిక నివేధికలు మరియు పార్లమెంట్ డాకుమెంట్స్ పరిశీలిస్తే, UPA మొదటి టర్మ్ (2004-09) నుండే ఎయిర్ ఇండియా నష్టాల్లో ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. ఎయిర్ ఇండియా నష్టాలకు సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.
కేవలం ప్రభుత్వ రంగ విమానయాన సంస్థలు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థలు మరియు విమానాశ్రయాలు కూడా నష్టాల్లో నడిచిన సందర్భాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఇతర PSU సంస్థల నష్టాలు:
ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా 2004-14 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టాల్లో నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఐతే నష్టాల్లో ఉన్న PSUలను పునరుద్ధరించడానికి 2004లో అప్పటి ప్రభుత్వం Board for Reconstruction of Public Sector Enterprises (BRPSE) పేరుతో ఒక బోర్డును ఏర్పాటు చేసింది.
2005-2015 మధ్య కాలంలో PSUలకు చెందిన 4000 కోట్లకు పైచిలుకు నష్టాలను ఈ బోర్డు అప్పటి ప్రభుత్వం మాఫీ చేసింది. ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 2004 నుండి PSUలు నమోదు చేసిన నష్టాలకు సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ చూడొచ్చు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో వివిధ ప్రభుత్వ రాంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా బ్యాంకులు, ఎయిర్పోర్టులు, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలను నమోదు చేసాయి.