దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేత టీ. జీవన రెడ్డి సహకారంతో ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకుందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పదేళ్ల తర్వాత తెరుచుకున్న ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: 06 మార్చి 2024లో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించిన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నవంబర్ 2025 నాటిక్లలా ఫ్యాక్టరీని పున: ప్రారంభిస్తామని చెప్పారు. పైగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు ఉత్తర ప్రదేశ్‌లోని షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, 06 మార్చి 2024న తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి డీ. శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే టీ. జీవన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు జగిత్యాల జిల్లాలోని గత కొన్నేళ్లుగా మూసివేయబడ్డ ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రైతులు, అధికారులు, యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నామని, నవంబర్ 2025 నాటికి ఫ్యాక్టరీని తెరుస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం ఏర్పాటు చేసిన పునరుద్ధరణ కమిటీ ప్రభుత్వానికి నివేదికని అందజేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో ముందుగా 02 డిసెంబర్ 2023లో ‘creative_city_gola’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో అప్‌లోడు చేసినట్లుగా గుర్తించాం. ఈ వీడియో గోలా గోకర్నాథ్ పట్టణంలో ఉన్న బజాజ్ హిందుస్థాన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినదిగా పేర్కొన్నారు.
వీడియోలో కనిపిస్తున్న సంచిపై కూడా ఇదే వివరాలు ఉండడం గమనించవచ్చు. పై ఆధారాలను బట్టి, ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఇంకా తెరుచుకోలేదని, వీడియోలోని దృశ్యాలు ఉత్తర ప్రదేశ్ లోని షుగర్ ఫ్యాక్టరీకి చెందినవని నిర్ధారించవచ్చు.
చివరిగా, ఉత్తర ప్రదేశ్‌లోని షుగర్ ఫ్యాక్టరీ వీడియోని షేర్ చేస్తూ ముత్యంపేట నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పున:ప్రారంభం అయ్యిందని తప్పుగా షేర్ చేస్తున్నారు.