Fake News, Telugu
 

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోతున్నది ‘అతి వేగం’ వల్ల, టైర్లలో ఎక్కువ గాలి నింపడం వల్ల కాదు

0

సాధారణంగా మనం కార్ టైర్లలో కొట్టించే గాలికి సంబంధించి ఒక మతానికి చెందిన వారు కావాలని మోతాదుకు మించి గాలి నింపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎక్కువ సంఖ్యలో హిందువులు చనిపోతున్నారని, దీనిని ‘పంక్చర్ జిహాద్’ అంటారని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక మతానికి చెందిన వారు కార్ టైర్లలో మోతాదుకు మించి గాలి నింపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎక్కువ సంఖ్యలో హిందువులు చనిపోతున్నారు.

ఫాక్ట్(నిజం): కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ల ప్రకారం ప్రతీ సంవత్సరం జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రెడ్ లైట్ బ్రేక్ చేయడం, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వినియోగం వంటి స్వయంకృత అపరాదాలే కారణం అవుతున్నాయి. ఒక మతానికి చెందిన వారు టైర్లలో గాలి ఎక్కువ నింపడం వల్ల హిందువులు చనిపోతున్నారన్నది ఒక అసంబద్ధ వాదన, ఎందుకంటే రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నవారికి సంబంధించి మతపరమైన సమాచారం ప్రభుత్వం సేకరించదు, కాబట్టి ఆ వాదనకి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతీ సంవత్సరం దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకి సంబంధించి ఒక నివేదికని విడుదల చేస్తుంది. లేటెస్ట్ రోడ్ ఆక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2019 రిపోర్ట్ ప్రకారం, 2019 సంవత్సరంలో దేశం మొత్తంలో 4,49,002 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. గత పది సంవత్సరాలతో పోల్చుకుంటే 2019లోనే ఈ సంఖ్య తక్కువగా ఉంది.

ఐతే ఈ రిపోర్ట్ ప్రకారం, 2019లో 63% – 73% రోడ్డు ప్రమాదాలకి, అలాగే 62% – 70% రోడ్డు ప్రమాదాల మరణాలకు అతివేగం కారణం. మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రెడ్ లైట్ బ్రేక్ చేయడం మరియు డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వినియోగం మొదలైన ఇతర కారణాలు కూడా రోడ్ ఆక్సిడెంట్లకి దారి తీస్తున్నాయి.

2008-19 వరకు అందుబాటులో ఉన్న రోడ్డు ప్రమాదాల రిపోర్ట్ల ప్రకారం చాలా వరకు ఆక్సిడెంట్లకి ట్రాఫిక్ నియమ ఉల్లంఘన, డ్రైవర్ తప్పిదాలే కారణం కాగా, ఈ రెండు క్యాటేగిరిలలో అతివేగమే ప్రమాదాలకు, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగిన మరణాలలో ముఖ్య కారణంగా ఉంటూ వస్తుంది. దీన్ని బట్టి, చాలా వరకు రోడ్డు ప్రమాదాలకి టైర్లలో గాలికి పెద్దగా సంబంధంలేదని చెప్పొచ్చు.

ఐతే ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలకు సంబంధించి చనిపోయిన వారు, కారణమైన వారు లేదా గాయపడ్డ వారి యొక్క  మతపరమైన వివరాలు సేకరించదు. మనది హిందూ మెజారిటీ దేశం కాబట్టి సహాజంగానే ఆక్సిడెంట్లలో మరణించే వారిలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే ఈ మరణాలకు ముస్లిమ్స్ కారణం అన్న వాదనకి హేతుబద్దత లేదు, ఎందుకంటే పైన చెప్పినట్టు చాలా వరకు ప్రమాదాలకు అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి స్వయంకృత అపరాదాలే కారణమని ప్రభుత్వ సమాచారం ప్రకారం స్పష్టమవుతుంది. పైగా, టైర్లలో గాలి కొట్టే వారికీ సంబంధించి కూడా మతపరమైన సమాచారం లేదు. కాబట్టి గుడ్డిగా ముస్లిమ్స్ టైర్లలో ఎక్కువ గాలి నింపడం వల్ల ఆక్సిడెంట్లు జరుగుతున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

2014లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఆక్సిడెంట్లకి సంబంధించి అహ్మదాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన ఒక స్టడీ ప్రకారం 15% కేసులలో టైర్లలో ప్రెషర్ ఎక్కువై టైర్ పేలిపోవడం, వాహనం బోల్తా పడడం, స్కిడ్ అవ్వడం ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి. వేగంగా వెళ్ళేటప్పుడు రోడ్డు మరియు టైర్ మధ్య రాపిడి పెరిగి టైర్ లోపల ప్రెషర్ పెరుగుతుంది, దీనివల్ల అధిక వేడి ఉత్పన్నమై టైర్ పేలిపోవడం మొదలైనవి జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఐతే పైన తెలిపినట్టు, సాధారణంగా టైర్లలో గాలి ఎక్కువ నింపడం వల్ల టైర్ పగిలిపోవడం, స్కిడ్ అవ్వడం వంటివి జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, పోస్టులో చేస్తున్న వాదనలకు మాత్రం శాస్త్రీయత లేదు.

చివరగా, ఒక మతానికి చెందిన వారు వాహన టైర్లలో గాలి ఎక్కువ నింపడం వల్ల ప్రమాదాలు జరిగి హిందువులు చనిపోతున్నారంటూ ఒక అసంబద్ధమైన వాదనని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll