దేశంలో రోజురోజుకి పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ‘లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులలో 42% రాష్ట్రాలకు తిరిగి పంచుతుండడంతో నికరంగా పెట్రోల్ పై వసూలు చేసే పన్నులలో ఎక్కువ శాతం రాష్ట్రాలకే వెళ్తున్నాయని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నికరంగా పెట్రోల్ పై వసూలు చేసే పన్నులలో ఎక్కువ శాతం రాష్ట్రాలకే వెళ్తున్నాయి.
ఫాక్ట్ (నిజం): పెట్రోల్ పై కేంద్ర విధించే సెస్ రాష్ట్రాలకు పంచరు, కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో 41% అన్ని రాష్ట్రాలకు పంచుతారు. ఈ 41% లో తెలంగాణ వాటా 2.133% కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా 4.11%. ఈ గణాంకాల ఆధారంగా లెక్కేస్తే లీటర్ పెట్రోల్ పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి విధించే మొత్తం టాక్స్ లలో కేంద్రం వాటా రూ. 32.33 కాగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటా రూ. 26.21 మరియు రూ. 28.08. దీన్నిబట్టి లీటర్ పెట్రోల్ పై విధించే పన్నుల్లో రాష్ట్రాల కన్నా కేంద్రానికే ఎక్కువ వాటా వెళ్తుంది అని అర్ధమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు పెట్రోల్ మరియు డీజిల్ పై బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ రూపంలో పన్నులు విధిస్తూ ఉండేది. ఐతే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో పెట్రోల్ పై వసూలు చేసే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని కొంత తగ్గించి, తగ్గించినదానికి అనుగుణంగా కొత్తగా Agriculture Infrastructure and Development Cess (AIDC) విధించారు. బడ్జెట్ కి ముంది బడ్జెట్ తర్వాత పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం పన్నులు మరియు సెస్ ల రూపంలో ఎలా వసూలు చేసేదో కింది టేబుల్ లో చూడొచ్చు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్ పై ఈ క్రింద లిస్ట్ చేసిన నాలుగు విధాలుగా ఎక్సయిజ్ డ్యూటీని వసూలు చేస్తోంది.
- బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ (BED) – లీటర్ పెట్రోలుపై రూ. 1.40
- స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) – లీటర్ పెట్రోలుపై రూ.11
- అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్) (AED) – లీటర్ పెట్రోలుపై రూ. 18
- అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC) – లీటర్ పెట్రోలుపై రూ. 2.50
బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ అనేది సెంట్రల్ ఎక్సయిజ్ తారిఫ్ ఆక్ట్, 1985 ద్వారా ప్రవేశపెట్టగా, స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (SAED) 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు. ఐతే ఈ ఆక్ట్ లో చెప్పిన దాని ప్రకారం, SAED కింద వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం సర్ ఛార్జి రూపంలో వసూలు చేస్తారు కాబట్టి, వసూలు చేసే మొత్తం కేంద్రానికే చెందుతుంది. కాబట్టి స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) ద్వారా వసూలు చేసేది డివిజబుల్ పూల్ లోకి రాదు, అంటే ఇందులో రాష్ట్రలుకు ఎటువంటి వాటా ఉండదు.
ఇక పెట్రోలుపై అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీని (AED) 1998 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టారు, దీనినే రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అని కూడా అంటారు. ఐతే ఈ 1998 ఫైనాన్స్ ఆక్ట్ ప్రకారం అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసింది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్తుంది, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. ఇదే విధంగా డీజిల్ పై కూడా AEDని 1999 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశ పెట్టారు. దీంట్లో కూడా రాష్ట్రాలకు వాటా ఉండదు.
చివరగా 2021-22 బడ్జెట్ లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ని ప్రవేశపెట్టారు, ఈ సెస్ కింద వసూలు చేసేది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది.
అంటే ఈ నాలుగింటిలో కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ. 1.40లో మాత్రమే రాష్ట్రాలకు వాటా ఉంటుంది. మిగతా మూడు రూపాలలో వసూలు చేసే రూ. 31.5 పూర్తిగా కేంద్రానికే వెళ్తుంది, ఇందులో రాష్ట్రాలకు వాటా ఉండదు.
మొత్తంగా పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ. 32.9 టాక్స్ వసూలు చేస్తుంది. ఐతే పైన చెప్పినట్టు ఈ మొత్తంలో కేవలం ఈ బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ.1.4 పైసలని మాత్రమే ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదించిన విధంగా అన్ని రాష్ట్రాలకు పంచుతారు. మిగతా మూడు రూపాలలో (సెస్ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ) వసూలు చేసే రూ. 31.5 పూర్తిగా కేంద్రానికే, ఇందులో రాష్ట్రాల వాటా ఉండదు.
ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనలు:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య రెవిన్యూ/ టాక్స్ పంపకాలకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడానికి ప్రతీ ఐదేళ్ళ కొకసారి రాష్ట్రపతి ఫైనాన్సు కమిషన్ ని ఏర్పాటు చేసారు. ఈ ఫైనాన్సు కమిషన్ లోతుగా స్టడీ చేసి జనాభా, రాష్ట్ర విస్తీర్ణం, తలసరి ఆదాయం, అటవీ విస్తీర్ణం మొదలైన అంశాలను పరిగణలోకి తెసుకుంటూ ఒక్కో అంశానికి ఒక్కో వెయిటేజ్ ఇచ్చుకుంటూ కేంద్ర రెవిన్యూలో మొత్తంగా రాష్ట్రాలకు ఎంత శాతం చెందాలి, ఒక్కో రాష్ట్రానికి ఎంత శాతం చెందాలన్న విషయాలపై మరియు ఇతర ఆర్ధిక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తుంది. ఫైనాన్సు కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ కమిషన్ చేసిన ప్రతిపాదనలు కచ్చితంగా అమలు చేయాలనీ రూల్ ఏమి లేదు, కాకపోతే కమిషన్ చేసిన ప్రతిపాదనలు చాలా వరకు ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్ను వాటాలకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి.
ఇంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో 2005-10 మధ్య కాలానికి కేంద్ర పన్నులోని డివిసబల్ పూల్ లో రాష్ట్రాలకు 30.5% వాటా ఉండాలని 12వ ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదించగా, 13వ ఫైనాన్సు కమిషన్ 2010-15 కాలానికి రాష్ట్రాల వాటా 32% గా ఉండాలని నిర్ణయించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇంచు మించు ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనల మేరకు రాష్ట్రాలకు వాటా కల్పించాయి.
అలాగే 2014లో BJP ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015-20 కాలానికి కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42% ఉండాలని 14th ఫైనాన్సు కమిషన్, అలాగే 2020-25 కాలానికి ఈ వాటా 41% ఉండాలని 15th ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను ఆయా ప్రభుత్వాలు ఆమోదించాయి. దీన్నిబట్టి, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య పన్నులు వాటా ఆయా సమయాల్లో ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనల మేరకే జరిగినట్టు అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు పెట్రోల్ పై విధించే టాక్స్ లో కేంద్ర మరియు రాష్ట్రాల వాటా:
ప్రస్తుతం 15th ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనలు అమలులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 41%గా ఉంది, ఇందులో ఏ రాష్ట్రానికి ఎంత శాతం వాటా ఉండాలనేది కూడా ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదిస్తుంది. ఉదాహారణకి 15th ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదనల ప్రకారం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ కి 4.11% మరియు తెలంగాణకు 2.133% వాటా వస్తుంది. అంటే కేంద్రం లీటర్ పెట్రోల్ పై వసూలు చేసే టాక్స్ లో రాష్ట్రాలకు పంచె మొత్తంలో తెలంగాణకు 2.133% మరియు ఆంధ్రప్రదేశ్ కి 4.11% వాటా వస్తుంది.
పైన చెప్పినట్టు కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే దాంట్లో మాత్రమే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో శాతం చొప్పున పంచుతారు. అంటే లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే రూ.1.4 లో 41%, అనగా రూ. 0.57 పైసల వాటా అన్ని రాష్ట్రాలకి పంచుతారు, మిగిలిన మొత్తం అంటే రూ. 0.83 పైసలు కేంద్రానికి వెళ్తాయి. 15వ ఫైనాన్సు కమిషన్ ప్రతిపాదించినదాని ప్రకారం ఈ రూ. 0.57 పైసలలో తెలంగాణ వాటా (2.133%) కింద రూ.0.01 పైసలు కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా (4.11%) కింద రూ.0.02 పైసలు ఆ రాష్ట్రానికి చెందుతుంది. అంతే గాని పోస్టులో చెప్పినట్టు ప్రతీ రాష్ట్రానికి 41% వాటా ఉండదు.
ఐతే పెట్రోల్ పై రాష్ట్రాలు విధించే సేల్స్ టాక్స్ కి సంబంధించి ఒక్కో రాష్ట్రం ఒక్కో పద్దతిని పాటిస్తూ వస్తుంది. ఉదాహరణకి తెలంగాణా ప్రభుత్వం పెట్రోల్ పై 35.20% VAT వసూలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31% VAT + ₹ 4/Ltr VAT +₹ 1/Ltr రోడ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తుంది. 29 జూన్ 2021 నాటికి HPCL యొక్క ప్రైస్ బిల్డుప్ ఆధారంగా వివిధ రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు కింది టేబుల్ లో చూడొచ్చు.
ఈ గణాంకాల ఆధారంగా లెక్కిస్తే తెలంగాణలో అమ్మే లీటర్ పెట్రోల్ పై కేంద్రం విధించే సెస్ లు మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (రూ. 31.5) మరియు బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో కేంద్ర వాటా (రూ.0.83) మొత్తం కలిపి రూ. 32.33 కేంద్ర ఖజానాకి వెళ్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ (రూ. 26.2) మరియు కేంద్రం విధించే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో వాటా కింద (రూ.0.01 పైసలు) మొత్తం కలిపి రూ. 26.21 పైసలు రాష్ట్ర ఖజానాకి వస్తాయి.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ (రూ. 28.06) మరియు కేంద్రం విధించే బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీలో వాటా కింద (రూ.0.02 పైసలు) మొత్తం కలిపి రూ. 28.08 పైసలు రాష్ట్ర ఖజానాకి వస్తాయి. ఈ వివరాల ప్రకారం పెట్రోల్ పై విధించే టాక్స్ లలో పోస్టులో చెప్తున్న దానికి విరుద్దంగా ఎక్కువ శాతం కేంద్ర ఖజానాకే వెళ్తున్నాయి.
పెట్రోల్ మరియు డీజిల్ పై విధించే పన్నులలో కేంద్ర మరియు రాష్ట్రాల వాటాకి సంబంధించి FACTLY ఇంతకు ముందు రాసిన కథనాలు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, లీటర్ పెట్రోల్ పై నికరంగా పన్నుల రూపంలో రాష్ట్రాలకన్నా కేంద్రానికే ఎక్కువ మొత్తం వెళ్తున్నాయి.
సవరణ (JULY 01, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.