Fact Check, Fake News, Telugu
 

పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ టాక్స్ వసూలు చేస్తున్నాయన్న వాదనలో నిజం లేదు.

0

ఇటీవల కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరసగా పెరుగుతున్న నేపధ్యంలో పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వాల కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే అధికంగా పన్నులు వసూలు చేస్తున్నాయని తెలిపే నేపధ్యంలో పెట్రోల్ ధరలకి (ప్రైస్ బిల్డ్ అప్) సంబంధించి వివరణ ఇస్తూ, లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం రూ.16.50 పైసలు పన్ను వసూలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.38.55 పైసలు వసూలు చేస్తుందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ₹ 16.50 పైసలు పన్ను వసూలు చేస్తోంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ₹ 38.55 పైసలు వసూలు చేస్తుంది.

ఫాక్ట్(నిజం): IOCL ఢిల్లీలో తమ సంస్థ పెట్రోల్ బంక్ ద్వారా విక్రయించే లీటర్ పెట్రోల్ ధరకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం 16 ఫిబ్రవరీ 2021 రోజున ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹ 89.29. కాగా, ఇందులో ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర ₹ 32.10,  ఆయిల్ కంపెనీలు డీలర్లకు చెల్లించే కమిషన్ ₹ 3.68. ఐతే లీటర్ పెట్రోల్ పై కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹ 32.90 కాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ ₹ 20.61. ఈ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై ₹ 24.17 పైసలు (35.20% 68.68) VAT రూపంలో వసూలు చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైతే లీటర్ పెట్రోల్ పై ₹ 26.29 వసూలు చేస్తోంది. ఐతే ఈ రెండు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ₹ 32.90 వసూలు చేస్తోంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఢిల్లీలో తమ సంస్థ పెట్రోల్ బంక్ ద్వారా విక్రయించే లీటర్ పెట్రోల్ ధరకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం 16 ఫిబ్రవరీ 2021 రోజున ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹ 89.29. కాగా, ఇందులో ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర ₹ 32.10,  ఆయిల్ కంపెనీలు డీలర్లకు చెల్లించే కమిషన్ ₹ 3.68. ఐతే లీటర్ పెట్రోల్ పై కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹ 32.90 కాగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ ₹ 20.61.

Petroleum Planning & Analysis Cell (PPAC) వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై 30% VAT విధిస్తుంది. అంటే ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర ₹ 32.10 + ఆయిల్ కంపెనీలు డీలర్లకు చెల్లించే కమిషన్ ₹ 3.68 + కేంద్రం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹ 32.90 మొత్తం కలిపితే వచ్చే ₹ 68.68 లో 30% అన్నమాట (20.61).

పెట్రోల్ పై ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా VAT వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకి తెలంగాణా ప్రభుత్వం పెట్రోల్ పై 35.20% VAT వసూలు చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31% VAT + ₹ 4/Ltr VAT +₹ 1/Ltr రోడ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తుంది. పైన ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి వివరించిన ప్రకారం లెక్కేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై ₹ 24.17 పైసలు (35.20% 68.68) VAT రూపంలో వసూలు చేస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైతే లీటర్ పెట్రోల్ పై ₹ 26.29 వసూలు చేస్తోంది. ఐతే ఈ రెండు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ₹ 32.90 వసూలు చేస్తోంది.

సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ + స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ + రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ విధిస్తుంది, ఇప్పుడు అదనంగా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ (AIDC)ని చేర్చింది. ఐతే ఈ నాలుగింటిలో స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్  మరియు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్స్ రూపంలో వసూలు చేసే పన్నులు పూర్తిగా కేంద్రానికే వెళ్తాయి, వీటిలో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై వసూలు చేసే మొత్తం టాక్స్ విలువ రూ. 32.9 కాగా, ఈ మొత్తంలో ఈ మూడు టాక్స్ లు మరియు సెస్స్ రూపంలోనే రూ. 31.5 వసూలు చేస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే ఈ మూడు టాక్స్ మరియు సెస్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే రూ. 31.5 మరియు డీజిల్ పై వసూలు చేసే టాక్స్ లో  రూ.30 పూర్తిగా కేంద్రానికే చెందుతుంది. కేవలం బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే దాంట్లో  41%  ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్క నిష్పత్తిలో పంచుతారు. ఐతే దిని నుండి రాష్ట్ర వాటా రూపంలో వచ్చేది మిగతా టాక్స్ లతో పోల్చితే చాలా తక్కువ.

ఐతే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటివల ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ₹. 2.5 /Ltr మరియు డీజిల్‌పై ₹.4 /Ltr  అగ్రికల్చర్ & డెవలప్మెంట్ సెస్‌ను విధించింది. ఐతే ఈ సెస్ ద్వారా వినియోగదారుడిపై అదనపు భారం పడకుండా సెస్ కి అనుగుణంగా బేసిక్ ఎక్సైజ్ సుంకం (BED) మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ (SAED) రేట్లు తగ్గించారు. ఇంతకు ముందురూ.2.98  గా ఉన్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీని ఇప్పుడు రూ.1.4 కి తగ్గించడంతో  వీటి నుండి రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఇంకా తగ్గనుంది.

చివరగా, పెట్రోల్ మరియు డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కన్నా ఎక్కువ టాక్స్ వసూలు చేస్తున్నాయన్న వాదనలో నిజం లేదు.

సవరణ (JULY 01, 2021): ఇంతకు ముందు ఈ ఆర్టికల్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న బేసిక్ ఎక్సయిజ్ డ్యూటీ మరియు స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకు పంచే డివిజబుల్ పూల్ లోకి వెళ్తుంది అని తప్పుగా పేర్కొనడం జరిగింది. కానీ 2002 ఫైనాన్స్ ఆక్ట్ ద్వారా ప్రవేశపెట్టిన స్పెషల్ అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ డివిజబుల్ పూల్ లోకి రాదు, ఇందులో రాష్ట్రాలకు ఎటువంటి వాటా ఉండదు. కావున ఈ ఆర్టికల్ లోని వివరాలన్నీ అందుకు అనుగుణంగా మార్చటం జరిగింది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.

Share.

About Author

Comments are closed.

scroll