ఫిబ్రవరి 2025లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన సందర్భంలో మోదీ కూర్చునేందుకు వీలుగా ఉండేలా ట్రంప్ కుర్చీని సరిచేశారు. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి మర్యాద దక్కుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ని అవమానించేదని చెప్తూ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ కోసం తన సీటుని ఖాళీ చేస్తున్న వీడియో (ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని తన కుర్చీ నుంచి లేపి అవమానిస్తున్న సోనియా గాంధీ.
ఫాక్ట్: ఇది క్లిప్ చేయబడిన వీడియో. పూర్తి వీడియోలో ఎస్పీజీ గార్డు సూచన మేరకు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తమకి కేటాయించబడిన సీట్లలో తిరిగి కూర్చోవడం చూడవచ్చు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోని ప్రసారం చేసిన వార్తా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, ఈ వీడియో 2011 నాటిది. లోక్‌పాల్ బిల్లుపై జరగనున్న ఉన్నత స్థాయి సమావేశానికి సంబంధించి యూపీఏ మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి నివాసంలో 13 డిసెంబర్ 2011న ఈ సమావేశం జరిగింది.
ఇండియా టీవీ వార్తా కథనం ప్రకారం, మన్మోహన్ సింగ్ పొరపాటున సోనియా గాంధీ కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. దీన్ని గమనించిన ఎస్పీజీ గార్డ్స్, ఈ విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకురాగా, సోనియా గాంధీ కుర్చీ నుంచి లేచారు. తర్వాత, మన్మోహన్ సింగ్‌తో సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని చెప్పగా ఆయన లేచి తనకి కేటాయించిన సీటులో కూర్చున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని ఇండియా టీవీ వార్తా కథనంలో చూడవచ్చు.

ఆ సమయంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ఎస్పీజీ రక్షణ ఉన్నందున వారి సూచనల మేరకు ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చొని ఉంటారని భావించవచ్చు. ఎస్పీజీ ప్రోటోకాల్ ప్రకారం, ఎవరికి కేటాయించబడిన సీట్లలో వారు కూర్చోవడం అనేది భద్రతా కారణాల దృష్ట్యా ఒక ముఖ్యమైన నియమం.
చివరిగా, ఎస్పీజీ గార్డ్ సూచన మేరకు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ సీట్లు మారి, తమకి కేటాయించిన సీట్లలో కూర్చున్నారు.