ఆంధ్ర ప్రదేశ్‌లో Avian Influenza (బర్డ్ ఫ్లూ) వ్యాధి కలకలం రేపుతోంది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో ఈ వ్యాధి సోకిందని వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ). బర్డ్ ఫ్లూ విస్తరణ తగ్గించడానికి ప్రభుత్వం పలు చోట్ల కంటైన్మెంట్ జోన్లను(బయో సెక్యూరిటీ జోన్లు) ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఒక కుక్కపిల్ల రోడ్డు మీద పడిపోయి తచ్చాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ,ఇక్కడ) షేర్ చేయబడుతోంది. “కోడి మాంసం తిని కుక్క వైరస్ తో ఎలా తండ్లాడుతుందో,” అని క్లెయిమ్ చేస్తూ ఈ వీడియోని యూజర్లు షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: బర్డ్ ఫ్లూ ఉన్న కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుక్క వీడియో.
ఫ్యాక్ట్(నిజం): పాకిస్థాన్‌లో ఉన్న అనిమల్ షెల్టర్ అయిన లక్కీ అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్(LAPS) వాళ్లు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. రోడ్డు మీద ఎవరో తమ వాహనంతో ఈ కుక్కను గుద్ది వెళ్లిపోగా, అది వీడియోలో కనిపిస్తున్నట్లు బాధపడుతున్న వీడియో ఇది, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తినడం వల్ల కాదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియో పైన @lapskpk అనే వాటర్ మార్క్ ఉండటం మేము గమనించి, దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా @lapskpk అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాకు దొరికింది. వీరు వైరల్ వీడియోని 6 ఫిబ్రవరి 2025న అప్లోడ్ చేశారు.
ఈ పోస్ట్ యొక్క వివరణలో ఇది ఒక hit and run case, అంటే ఈ కుక్కను ఎవరో రోడ్డు మీద తమ వాహనంతో ఢీకొట్టి వెళ్లిపోయారు, అని చెప్పారు. అలాగే, ఈ కుక్కకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అని వారు చెప్పారు. అలాగే laps వారు ఆ కుక్కకు చికిత్స జరిపిస్తున్నప్పటి కొన్ని ఫోటోలు,వీడియోలు పోస్ట్ చేశారు (ఆర్కైవ్ లింక్). అంతే కానీ వైరస్ రావడం వల్ల ఈ కుక్కకి ఇలా అయ్యింది అని వారు చెప్పలేదు.
LAPS, లక్కీ అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్, దీన్ని పాకిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వాలో ఉన్న చర్సద్దా జిల్లాలో జేబా మసూద్ అనే మహిళ నడుపుతారు(ఇక్కడ, ఇక్కడ). @lapskpk వారి సోషల్ మీడియా పేజీలలో జంతువుల వీడియోలు చాలా ఉన్నాయి.

అంటే వైరల్ పోస్టులో ప్రమాదంలో గాయపడ్డ ఈ కుక్క వీడియోని తప్పుగా, బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం వల్ల తనకు ఇలా అయ్యింది అని షేర్ చేస్తున్నారు. అలాగే, సామాన్యంగా Avian Influenza, అనగా బర్డ్ ఫ్లూ వలస నీటి పక్షులకి ఇంకా పౌల్ట్రీ పక్షులకి వస్తుంది. కానీ వేరే జంతువులకి కూడా ఇది గతంలో సోకినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి అని అమెరికా యొక్క Centers for Disease Control and Prevention వారు చెప్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మీరు ఇక్కడ, ఇక్కడ పొందుకోవచ్చు.
చివరిగా, పాకిస్థాన్‌లో ఒక ప్రమాదంలో గాయాలపాలైన కుక్క వీడియోని, బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య ఉన్న కుక్క అని తప్పుగా షేర్ చేస్తున్నారు.