Fake News, Telugu
 

గాంధీ అస్తికలలో అధిక భాగాన్ని త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు

0

భారత స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1948లో హత్యకు గురైన తర్వాత గంగా, యమునా నదులలో ఆయన అస్తికలను కలపకుండా రాంపూర్ అనే ప్రదేశానికి తీసుకువెళ్లి ఇస్లామిక్ పద్దతిలో పాతిపెట్టి, దానిపైన ఒక సమాధిని నిర్మించారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అస్తికలను గంగా లేదా యమునా నదులలో కలపకుండా రాంపూర్ అనే ప్రదేశానికి తీసుకువెళ్లి ఇస్లామిక్ పద్దతిలో పాతిపెట్టి సమాధిని నిర్మించారు.

ఫాక్ట్: గాంధీ అస్తికలలో అధికభాగం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. మిగిలిన భాగాలను దేశ విదేశాలలో అనేక ప్రాంతాలకు తరలించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అప్పటి రాంపూర్ రాజ్యం యొక్క నవాబు అయిన రజా అలీ ఖాన్ గాంధీపై గౌరవంతో ఆయన అస్తికలలో కొంత భాగాన్ని కోరుతూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూని అడగగా, నెహ్రూ అందుకు అంగీకరించారు. ఆ తర్వాత గాంధీ జ్ఞాపకార్థం రాంపూర్‌లో ఈ అస్తికలను ఉంచి ఒక సమాధిని నిర్మించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా గాంధీ అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరిగాయనే విషయంపై ఇంటర్నెట్లో వెతకగా గాంధీ మ్యూజియం, గాంధీ హెరిటేజ్ పోర్టల్, బీబీసి, ది లైఫ్ మొదలగు వెబ్‌సైట్లలో ప్రచురితమైన కథనాలు, వీడియోలు మరియు ఫొటోలు లభించాయి. వీటి ప్రకారం, 30 జనవరి 1948లో గాంధీ హత్యకి గురైన తర్వాత ఆయన మృతదేహానికి 31 జనవరి నాడు ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. సంబంధిత ఫొటోలను ఇక్కడ చూడవచ్చు.

ఇక గాంధీ అస్తికలలో అధిక భాగాన్ని 12 ఫిబ్రవరి 1948లో ప్రత్యేక రైలులో అలహాబాదుకు (ప్రయాగ్ రాజ్) తరలించి అక్కడ గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో కలపడం జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అయితే మిగిలిన అస్తికలను 20కి పైగా భాగాలుగా చేసి వివిధ నదులలో కలిపేందుకు దేశంలోని పలు ప్రాంతాలకు మరియు విదేశాలకు కూడా పంపడం జరిగింది. వీటికి సంబంధించిన కలశాలు ఢిల్లీలోని గాంధీ మ్యూజియంలో ఉన్నట్లు మ్యూజియం వెబ్‌సైట్లో చూడవచ్చు.

ఇక ఉత్తరప్రదేశ్‌లోని అప్పటి రాంపూర్ రాజ్యం యొక్క నవాబు అయిన రజా అలీ ఖాన్ గాంధీపై గౌరవంతో ఆయన అస్తికలలో కొంత భాగాన్ని కోరుతూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూని అడగగా, నెహ్రూ అందుకు అంగీకరించారు. ఆ తర్వాత గాంధీ జ్ఞాపకార్థం రాంపూర్‌లో ఈ అస్తికలను ఉంచి ఒక సమాధిని నిర్మించారు.

చివరిగా, గాంధీ అస్తికలలో అధికభాగం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. మిగిలిన భాగాలను దేశ విదేశాలలో అనేక ప్రాంతాలకు తరలించారు.

Share.

About Author

Comments are closed.

scroll