“హిజాబ్ వర్సెస్ కాషాయం!! వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు, ఇళ్లపై దాడి చేసి దోచుకుంటున్న దృశ్యాలు……,” అని చెప్తూ కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఘటనల నేపథ్యంలో ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. వీడియోలోని ఘటనలు నిన్న కర్ణాటకలో జరిగినట్టు పోస్ట్ చేసిన వారు కామెంట్స్‌లో రాసినట్టు చూడవచ్చు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కర్ణాటకలో హిందువుల షాపులు మరియు ఇళ్లపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియోలో ఉన్న దృశ్యాలు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి కావు. అవి 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు. హిజాబ్ ఘటనల్లో భాగంగా కర్ణాటకలో తాజగా కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే. అయితే, ‘వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు, ఇళ్లపై దాడి చేసి దోచుకుంటున్నారు’ అనడంలో మాత్రం వాస్తవం లేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించిన ఎటువంటి సమాచారం సెర్చ్ రిజల్ట్స్‌లో రాలేదు. అయితే, పోస్ట్ చేసిన వీడియోపై ‘The Sun’ వార్తాసంస్థ లోగో ఉన్నట్టు గమనించవచ్చు. కాబట్టి, వారి యూట్యూబ్ ఛానట్‌లో కొన్ని కీ-వర్డ్స్ ఉపయోగించి వెతకగా, పోస్ట్‌లోని వీడియోలో ఉన్న దృశ్యాలతో వారి ఛానట్‌లో ఉన్న ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోని వారు ఫిబ్రవరి 2020లో పోస్ట్ చేసి, అది ఢిల్లీ అల్లర్లకు సంబంధించింది అని రాసినట్టుగా చదవచ్చు.
హిజాబ్ ఘటనల్లో భాగంగా కర్ణాటకలో తాజగా కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే. వాటికి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే, ‘వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు, ఇళ్లపై దాడి చేసి దోచుకుంటున్నారు’ అనడం మాత్రం తప్పు. అలాంటి ఘటనలు తాజగా కర్ణాటకలో జరిగినట్టు ఎవరు ఎక్కడా రిపోర్ట్ చేయలేదు.
చివరగా, 2020 ఢిల్లీ అల్లర్ల వీడియో పెట్టి, కర్ణాటకలో ‘వేలాది మంది ముస్లింలు హిందువుల షాపులు,ఇళ్లపై దాడి’ అని షేర్ చేస్తున్నారు.