Fake News, Telugu
 

ఈ ఫోటోలో జో బైడెన్ మోకాళ్ళపై కూర్చుంది జార్జ్ ఫ్లాయిడ్ కూతురు ముందు కాదు.

0

అమెరికాలో పోలీసుల దాడిలో చనిపోయిన జార్జ్ ఫ్లాయిడ్ కూతురికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శిరస్సు వంచి క్షమాపణలు చెప్తున్నాడని చెప్తూ, జో బైడెన్ ఒక చిన్నారి ముందు మోకాళ్ళపై కూర్చున్న ఫోటోని షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలీసుల దాడిలో చనిపోయిన జార్జ్ ఫ్లాయిడ్ కూతురికి శిరస్సు వంచి క్షమాపణలు చెప్పాడు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 09 సెప్టెంబర్ 2020న జో బైడెన్ డెట్రాయిట్ పర్యటనలో భాగంగా ఒక బట్టల షాప్ వద్ద ఆగినప్పుడు ఆ షాప్ యజమాని కొడుకుతో మాట్లాడిన సందర్భంలో తీసింది. ఆ పిల్లాడి పేరు సి.జే. బ్రౌన్. ఈ ఘటనని చాలా వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. జో బైడెన్ జార్జ్ ఫ్లాయిడ్ కూతురి ముందు కూతురికి శిరస్సు వంచి క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి సమాచారం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని రాయిటర్స్ వార్తా సంస్థకి చెందిన ఒక జర్నలిస్ట్ 10 సెప్టెంబర్ 2020న షేర్ చేస్తూ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటో జో బైడెన్ డెట్రాయిట్ పర్యటనలో భాగంగా ఒక బట్టల షాప్ వద్ద ఆగినప్పుడు సి.జే. బ్రౌన్ అనే పిల్లాడితో మాట్లాడిన సందర్భంలో తీసింది. ఇంకా ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటో తీసింది లేహ్ మిల్లిస్ అని తెలిసింది.

ఈ ట్వీట్ ఆధారంగా రాయిటర్స్ పిక్చర్స్ వెబ్సైటులో వెతకగా అసలు ఫోటో కనిపించింది. ఈ వెబ్సైటులో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు 09 సెప్టెంబర్ 2020న డెట్రాయిట్ సందర్శనలో భాగంగా ఒక బట్టల షాప్ వద్ద ఆగినప్పుడు సి.జే. బ్రౌన్ అనే పిల్లాడితో మాట్లాడినప్పుడు ఈ ఫోటో తీసారు. 15 సెప్టెంబర్ 2020న జో బైడెన్ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంటులో కూడా షేర్ చేసాడు.

ఇంకా గూగుల్ సెర్చ్ ద్వారా ఇదే ఫోటో Getty Images వెబ్సైటులో కూడా కనిపించింది. వెబ్సైటులో ఈ ఫోటోకి సంబంధించి ఉన్న సమాచారం ప్రకారం ఫోటోలో కనిపిస్తున్న చిన్న పిల్లాడు జో బైడెన్ డెట్రాయిట్ లో సందర్శించిన  బట్టల షాప్ యజమాని కొడుకు.

ఐతే జూన్ 2020లో పోలీసుల దాడిలో చనిపోయిన జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలకు ముందు జో బైడెన్ ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసినప్పటికి, పోస్టులో చూపిస్తున్న ఫోటోలో ఉన్నది మాత్రం జార్జ్ ఫ్లాయిడ్ కూతురు కాదు. జో బైడెన్ జార్జ్ ఫ్లాయిడ్ కూతురి ముందు కూతురికి శిరస్సు వంచి క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, ఈ ఫోటోలో జో బైడెన్ మోకాళ్ళపై కూర్చుంది జార్జ్ ఫ్లాయిడ్ కూతురు ముందు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll