హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పౌల్ట్రీ ఫారంలోని కోళ్లకు కరోన సోకిందని, అందులో పనిచేసే కార్మికుల ద్వారా కోళ్లకు కరోన సోకినట్లు సమాచారం ఉందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్ లోని ప్రముఖ పౌల్ట్రీ ఫారంలోని కోళ్లకు అక్కడి కార్మికుల ద్వారా కరోనా సోకింది – way2news.
ఫాక్ట్: way2news వారే ఒక ఆర్టికల్ ద్వారా ఈ పోస్ట్ లోని సమాచారం ఫేక్ అని చెప్పారు. ఆ ఆర్టికల్ లో వారు ‘కోళ్లకు కూడా సోకిన కరోన మహమ్మారి’ పేరుతో ఒ ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని, ఆ వార్తను way2news వారు పబ్లిష్ చేయలేదు అని తేల్చి చెప్పారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్ట్ లోని ఫోటో లోని సమాచారం గురించి way2news వారి మొబైల్ ఆప్ లో వెతకగా, ఈ ఆర్టికల్ కు డైరెక్ట్ చేసింది. ఆ ఆర్టికల్ లో వారు ‘కోళ్లకు కూడా సోకిన కరోన మహమ్మారి’ పేరుతో ఒక ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారని, ఆ వార్తను way2news వారు పబ్లిష్ చేయలేదు అని, ఇలాంటి ఫేక్ ప్రచారం చేసే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడతాయని, వివరించారు.
జంతువులకు మనుషుల ద్వారా లేదా మనుషులకు జంతువుల ద్వారా కోవిడ్-19 సోకటానికి సంబంధించి, అమెరికాలోని CDC సంస్థ వారు కొన్ని విషయాలు వారి వెబ్ సైట్ లో తెలిపారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు, జంతువుల నుండి మనుషులకు కోవిడ్-19 వచ్చే అవకాశం చాలా తక్కువ అని వారు తెలిపారు. కొన్ని సమయాల్లో, ప్రజలనుండి జంతువులకు సోకటం గురించి సమాచారం ఉన్నటు అందులొ తెలిపారు.
భారత దేశంలో మనుషుల నుండి జంతువులకు కరోన సోకటం గురించి సమాచారం వెతికినప్పుడు, ఇటీవల మొట్టమొదటిసారి దేశంలో 8 సింహాలు కోవిడ్-19 బారిన పడ్డట్టు న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఆ ఎనిమిది సింహాలు బాగానే ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
చివరగా, హైదరాబాద్ లోని ప్రముఖ పౌల్ట్రీ ఫారంలోని కోళ్లకు కరోనా సోకిందని తప్పుగా షేర్ చేస్తున్నారు.