Fake News, Telugu
 

సీనియర్ సిటిజన్లకు టిక్కెట్ల ఛార్జీపై 50% రాయితీ ఇస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించలేదు

0

ఇకపై రైళ్లలో ప్రయాణించే 58 సంవత్సరాల పైబడిన వారికి ఛార్జీలపై 50 శాతం రాయితీ ఉంటుందని, అలాగే రైలు టికెట్ బుక్ చేసుకున్న సీనియర్ సిటిజన్లను ఆటోమేటిక్‌గా కింద బెర్త్ లభిస్తుందని రైల్వేశాఖ మంత్రి వెల్లడించారని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రైళ్లలో ప్రయాణించే 58 సంవత్సరాల పైబడిన వారికి ఛార్జీలపై 50 శాతం రాయితీ ఉంటుందని మరియు వారికి ఆటోమేటిక్‌గా కింద బెర్త్ లభిస్తుందని రైల్వేశాఖ మంత్రి వెల్లడించారు.

ఫాక్ట్: వృద్ధులకు, 45 ఏళ్లు పైబడ్డ స్త్రీలకు, గర్భిణీలకు రైల్వే బెర్త్‌లు కేటాయింపులో కొన్ని ప్రయోజనాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ మార్చి 2020లో వృద్ధుల టిక్కెట్లపై రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రయాణీకుల రాయితీల వలన ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని, అందువలన వీటిని విస్తరించడం వాంఛనీయం కాదని రైల్వేశాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ జులై 2022లో పార్లమెంటులో తెలిపారు. ఈ రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు రైల్వేశాఖ ఎక్కడా వెల్లడించలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

అధికారిక సమాచారం ప్రకారం, మార్చి 2020లో కోవిడ్-19 వ్యాప్తి నివారణా చర్యలలో భాగంగా రైళ్లలో వృద్ధుల రాయితీతో సహ పలు రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వృద్ధులకు ఇచ్చే రాయితీని తొలగించక ముందు రైల్వే శాఖ, 58 ఏళ్ల దాటిన మహిళలకు టికెట్ ఛార్జీలలో 50%, 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ఛార్జీలలో 40% రాయితీ కల్పించేది. అయితే ఈ రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు రైల్వేశాఖ ఎక్కడా వెల్లడించలేదు.

పైగా జులై 2022లో వృద్ధుల రాయితీ పునరుద్ధరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో  సమాధానమిస్తూ, ప్రయాణీకుల రాయితీల వలన ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని, కోవిడ్-19 కారణంగా ప్రయాణికుల టికెట్ల ఆదాయం తగ్గిపోయిందని, వయో వృద్ధులు సహా మొత్తం అన్ని వర్గాలకూ రాయితీలను విస్తరించడం వాంఛనీయం కాదని తెలిపారు. టికెట్ ధర తక్కువగా ఉన్న కారణంగా ప్రయాణ వ్యయంలో సగటున 50 శాతాన్ని రైల్వే శాఖే భరిస్తుందని, ఇలాంటి పరిస్థితులలో కూడా వైకల్యం ఉన్న వారికి, రోగులకు, విద్యార్థులకు రాయితీలను కొనసాగిస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ అప్పుడు తెలిపారు. ఇక సుప్రీం కోర్టులో వృద్ధుల రాయితీలను తిరిగి ప్రవేశపెట్టాలని కేసు వేయగా, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదని, వృద్ధుల అవసరాలు మరియు రైల్వే శాఖ లాభనష్టాల ప్రకారం ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఏప్రిల్ 2023లో సుప్రీం కోర్టు పేర్కొంది.

ఇక రైళ్లలో వృద్దులకు బెర్త్ కేటాయించే విషయానికి వస్తే, రైల్వే నిబంధనల ప్రకారం,  వృద్దులకు, సీనియర్ సిటిజన్లకు మరియు 45 ఏళ్లు పైబడ్డ మహిళలకు, ఆటోమేటిక్‌గా క్రింది బెర్త్ కేటాయించబడుతుంది. అయితే ఇది బుకింగ్ సమయంలో బెర్త్‌ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి రైళ్లలోని వివిధ కోచ్ లలో కొన్ని బెర్త్‌లు సీనియర్ సిటిజన్లకు, 45 ఏళ్లు దాటిన మహిళలకు మరియు గర్భిణీలకు కేటాయించబడతాయి. అలాగే రైలు కదిలిన తర్వాత కూడా ఒకవేళ క్రింది బెర్తులు ఖాళీగా ఉన్నట్లయితే వాటిని అవసరమున్న సీనియర్ సిటిజన్లకు, 45 ఏళ్లు దాటిన మహిళలకు మరియు గర్భిణీలకు కేటాయించే అధికారం టికెట్ చెకింగ్ సిబ్బందికి ఉంటుంది.

చివరిగా, రైలు టికెట్ ఛార్జీలో సీనియర్ సిటిజన్లకు ఇదివరకే తొలగించిన 50% రాయితీ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు రైల్వేశాఖ ఎక్కడా పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll