మణిపూర్ క్రైస్తవ కుకీ తెగ తమ నిరసనలలో వారి మహిళలను నగ్నంగా చేసి ఉద్యమంలో ముందు పెట్టడం ఒక వ్యూహంగా పాటిస్తారని, పోలీసులను కూడా వాళ్ళ ఊళ్లలోనికి రాకుండా ఇదే వ్యూహం అమలుచేస్తారంటూ సోషల్ మీడియాలో నగ్నంగా ఉద్యమిస్తున్న మహిళల ఫోటోలని షేర్ చేస్తున్నారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతో దేశమంతట ఇటీవల నిరసనలు వెళ్ళువెత్తుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లో జరుగుతున్న ఘటనలకు సంబంధించి మీడియా చూపించేదంతా నిజం కాదని, నిజనిజాలు తెలుసుకోకుండా జాతీయవాద ప్రభుత్వాన్ని మరియు భారత సైన్యాన్ని నిందించడం సరికాదని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మణిపూర్ క్రైస్తవ కుకీ తెగ తమ నిరసనలలో వారి మహిళలను నగ్నంగా చేసి ఉద్యమంలో ముందు పెట్టడం ఒక వ్యూహంగా పాటిస్తారంటూ షేర్ చేస్తున్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): 2004లో తంగజం మనోరమ అనే యువతి అస్సాం రైఫిల్స్ నిర్భందంలో చనిపోయిన ఘటనను నిరసిస్తూ మైరా పైబీ ఉద్యమకారిణిలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన చేపట్టిన దృశ్యాలను పోస్టులో షేర్ చేసిన ఫోటో చూపిస్తుంది. ఇమాస్ మరియు మదర్స్ ఆఫ్ మణిపూర్‌గా పిలవబడే ఈ మైరా పైబీలు, ఇంఫాల్ లోయలోని పలు వర్గాల నుండి వచ్చిన మైతేయ్ తెగకు చెందిన మహిళలని తెలిసింది. ఈ ఫోటోలలో నగ్నంగా నిరసన చేస్తున్నది కుకి తెగకు చెందిన మహిళలు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ బీబీసి వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. 2004లో మైరా పైబీలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని మిలిటరీ క్యాంప్ ఎదుట వివస్త్రలుగా నిరసన చేస్తున్న దృశ్యాలంటూ బీబీసి వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది.
2004లో తంగజం మనోరమ అనే యువతి అస్సాం రైఫిల్స్ నిర్భందంలో చనిపోయిన ఘటనను నిరసిస్తూ 12 మంది మైరా పైబీ ఉద్యమకారిణిలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన చేపట్టిన దృశ్యాలంటూ పలు వార్తా సంస్థలు ఈ ఫోటోలను షేర్ చేస్తూ తెలిపారు. భారత సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టిన సాయుధ దళాల ప్రత్యేక అధికారల చట్టం, 1958 (AFSPA) చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని మైరా పైబీ మహిళలు ఈ నిరసనలో భాగంగా డిమాండ్ చేశారు. తంగజం మనోరమ హత్యకు సంబంధించి, ఆమె హత్యను నిరసిస్తూ మణిపూర్‌లో జరిగిన నిరసనలకు సంబంధించి హ్యూమన్ రైట్స్ వాచ్ పబ్లిష్ చేసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
ఇమాస్ మరియు మదర్స్ ఆఫ్ మణిపూర్‌గా కూడా పిలవబడే ఈ మైరా పైబీలు, ఇంఫాల్ లోయలోని మైతేయ్ తెగకు చెందిన మహిళలని, వీరిని అక్కడి ప్రజలు అపారంగా గౌరవిస్తారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. 2004 నిరసనలో పాల్గొన్న కొందరు మైరా పైబీల ఇంటర్వ్యూ కథానాలన్నీ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోలో నగ్నంగా నిరసన చేస్తున్నది కుకి తెగకు చెందిన మహిళలు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 2004లో మైరా పైబీలు ఇంఫాల్‌లోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన చేసిన ఫోటోలని ప్రస్తుత మణిపూర్ ఘర్షణలకు ముడిపెడుతు షేర్ చేస్తున్నారు.