కేంద్రంలో 25 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంటే భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడమే కాకుండా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటుందని మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ (జేపీ) అభిప్రాయపడ్డాడు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఇక్కడ రాబోయే 25 ఏళ్లలో దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో, ప్రజలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలో ఈ వీడియోలో జేపీ వివరించారు. ఈ కథనం ద్వారా నిజంగా జేపీ ఇలా వ్యాఖ్యానించాడో లేదో తెలుసుకుందాం.
క్లెయిమ్: కేంద్రంలో 25 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంటే భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండడమే కాకుండా ఎవరికి అందనంత ఎత్తులో ఉంటుంది – లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ.
ఫాక్ట్(నిజం): 2023లో ఒక కార్యక్రమంలో G20కు సంబంధించి భారత్ సాధించిన విజయం గురించి మాట్లాడుతూ రాబోయే 25 ఏళ్లలో దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో (ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు వివేకవంతమైన ఆర్థిక విధానాలను అమలు చేయడం), ప్రజలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలో చెప్తూ జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసాడు, BJPని ఉద్దేశించి కాదు. ఇదే విషయాన్ని జేపీ స్పష్టం చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో 2023లో జయప్రకాశ్ నారాయణ ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడినప్పటిది. ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఈ కార్యక్రమంలో జేపీ BJP ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఈ వీడియో కు సంబంధించి మరింత సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా నేషనలిస్ట్ హబ్ అనే సంస్థ 2023 సెప్టెంబర్ లో జరిపిన చర్చా కార్యక్రమంలో జేపీ పాల్గొన్నప్పటిదని తెలిసింది. ఈ కార్యక్రమంలో జేపీతో పాటు సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం చివర్లో G20కు సంబంధించి భారత్ సాధించిన విజయం గురించి జయప్రకాశ్ నారాయణని మాట్లాడమని అడిగారు. అప్పుడు జేపీ స్పందిస్తూ భారత్ సాధించిన విజయాల గురించి ప్రస్తావిస్తాడు, ఆ తరవాత రాబోయే 25 ఏళ్లలో దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు ఎలా పనిచేయాలో (ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు వివేకవంతమైన ఆర్థిక విధానాలను అమలు చేయడం), ప్రజలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని ఓటు వేయాలో వివరిస్తాడు.
ఐతే ఈ సందర్భంలో సాధారణంగా అన్ని ప్రభుత్వాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడే గాని ప్రత్యేకంగా BJPకి మద్దతిస్తూ ఇలా మాట్లాడలేదు. ఈ కార్యక్రమం మొత్తం ఏ సందర్భంలో కూడా జేపీ ప్రత్యేకించి BJP గురించి మాట్లాడలేదు.
ఈ వైరల్ పోస్టులో చేస్తున్న వాదనకు సంబంధించి వివరణ కోరుతూ మేము జేపీకి మెయిల్ చేయగా, అయన స్పందిస్తూ తాను BJPను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడన్న వాదనను పూర్తిగా ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యలు సాధారణంగా అన్ని ప్రభుత్వాలను ఉద్దేశించినవని అయన స్పష్టం చేశారు. దీన్నిబట్టి జేపీ BJPని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసాడన్న వాదనలో నిజం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, కేంద్రంలో మరో 25 ఏళ్లు బీజేపీ ప్రభుత్వం ఉంటే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి అవుతుందని జయప్రకాశ్ నారాయణ అనలేదు.