Fake News, Telugu
 

2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ బీజేపీ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు అని చెప్తూ 2019 నాటి ఫోటోను షేర్ చేస్తున్నారు

0

13 మే 2024న జరగనున్న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బీజేపీ, RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) ప్రముఖ నేత రామ్ మాధవ్‌తో సమావేశమయ్యారు అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా వై.ఎస్. జగన్ రామ్ మాధవ్ కలిసి దిగిన ఫోటో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024న ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్ బీజేపీ, RSS ప్రముఖ నేత రామ్ మాధవ్‌తో సమావేశమయ్యారు, ఈ భేటికి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్ బీజేపీ, RSS ప్రముఖ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. అలాగే వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత  26 మే 2019న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్‌తో భేటీ అయిన సందర్భంలో తీసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, ఇటీవల ఏపీ సీఎం వై.ఎస్. జగన్ బీజేపీ, RSS ప్రముఖ నేత రామ్ మాధవ్‌తో సమావేశమయ్యారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఇటీవల కాలంలో వారిద్దరూ భేటి అయినట్లు ఎటువంటి సమాచారం మాకు దొరకలేదు.

తదుపరి మేము పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ 26 మే 2019న ‘ANI’ వార్త సంస్థ ప్రచురించిన వార్తా కథనం లభించింది. ఈ కథనం ప్రకారం, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 26 మే 2019న బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు. అలాగే రామ్ మాధవ్‌కు శాలువాతో పాటు తిరుపతి బాలాజీ విగ్రహాన్ని కూడా అందజేశారు.

ఇదే ఫోటోను షేర్ చేస్తూ రామ్ మాధవ్ తన వెబ్‌సైట్‌లో ఇదే విషయాన్ని తెలిపారు. అలాగే ANI సంస్థ తమ X(ట్విట్టర్)లో కూడా ఈ భేటికి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. దీన్ని బట్టి 2019 నాటి ఫోటోను ఇప్పుడు భేటీ అయినట్లు చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారు అని నిర్థారించవచ్చు.

చివరగా, 2024 ఎన్నికల నేపథ్యంలో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ బీజేపీ నేత రామ్ మాధవ్‌తో భేటీ అయ్యారు అని చెప్తూ 2019 నాటి ఫోటోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll