Fake News, Telugu
 

గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ గాంధీ కోసం ఏర్పాటు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

0

గాంధీతో మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేశారని చెప్తూ గాంధీ ఫోన్లో మాట్లాడుతున్న ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: గాంధీతో నేరుగా మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేసినప్పటి ఫోటో.

ఫాక్ట్: 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాల ముందుగానే 1897లో గుజరాత్‌లో మొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా, గాంధీ సబర్మతీ ఆశ్రమంలో టెలిఫోన్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. అయితే వైరల్ ఫోటో 1941లో మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో గాంధీ టెలిఫోన్ ఉపయోగిస్తున్నపుడు తీసినది. ఈ టెలిఫోన్‌ను అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో గాంధీతో మాట్లాడడానికి తన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పబడింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇది 1941లో మహారాష్ట్రలోని సేవాగ్రాం ఆశ్రమంలో తీసినట్లుగా కొన్ని స్టాక్ ఫోటో వెబ్సైట్లలో (ఇక్కడ & ఇక్కడ) పేర్కొనడం గుర్తించాం.

అంతేకాకుండా, సేవాగ్రామ్ ఆశ్రమం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో కాలంలో ఈ టెలిఫోన్ ఆశ్రమంలో ఏర్పాటు చేశారు. గాంధీతో మాట్లాడేందుకు ‘వీలుగా ఉంటుందని’ ఆయన ఈ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.

గాంధీ కోసం గుజరాత్‌లో తొలి టెలిఫోన్ ఏర్పాటు చేయబడిందా?

BSNL కోల్‌కతా వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, 1881లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కలకత్తా, బొంబాయి, మద్రాస్, కరాచీ మరియు అహ్మదాబాద్‌లలో టెలిఫోన్ ఎక్స్ఛేంజీల స్థాపనకు అనుమతిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన ఒరిజినల్ ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీ లిమిటెడ్‌కు లైసెన్స్ జారీ చేసింది. దీని ప్రకారం, 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రాకముందే గుజరాత్‌లో టెలిఫోన్ లైన్ల స్థాపన ప్రారంభమైందని తెలుస్తుంది.

పైగా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం, నగరంలో టెలిఫోన్ సర్వీస్ 1897లో ప్రారంభించబడింది. ఇండియా కల్చర్ వెబ్సైట్లో ఉన్న గెజిట్ ప్రకారం అహ్మదాబాద్ నగరంలోని పంచకువా గేట్ పరిసరాల్లో 17 జూలై 1897న ప్రారంభ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ స్థాపించబడిందని పేర్కొన్నారు. ప్రారంభ సమయంలో కేవలం 34 మంది వినియోగదారులు ఉన్నారు.

పై ఆధారాలను బట్టి, గుజరాత్‌లో ప్రారంభ టెలిఫోన్ కనెక్షన్ గాంధీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడలేదని, ఆయన భారతదేశానికి తిరిగి రావడానికి చాలా కాలం ముందే ఏర్పాటు చేయబడిందని ధృవీకరించవచ్చు. పైగా, గాంధీ 1917 నుండి 1930 వరకు నివసించిన సబర్మతి ఆశ్రమంలో టెలిఫోన్‌ను ఉపయోగించినట్లు సూచించే ఆధారాలేవీ అందుబాటులో లేవు.

చివరిగా, గుజరాత్‌లో మొదటి టెలిఫోన్ లైన్ గాంధీ కోసం ఏర్పాటు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll