Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న బాలుడు స్మోక్ బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యాడు, ఇప్పుడు చికిత్స తర్వాత బాగానే ఉన్నాడు

0

డ్రై ఐస్ (ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్) కలిపిన బిస్కెట్లు తిని రెండు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక బాబు చనిపోయాడు అని చెప్తూ వీడియో(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: డ్రై ఐస్ కలిపిన బిస్కెట్లు తిని అస్వస్థతకు గురై మరణించిన బాలుడిని చూపిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న బాలుడు చనిపోలేదు. ఈ సంఘటన 17 ఏప్రిల్ 2024న కర్ణాటకలోని దావణగెరెలోని పీబీ రోడ్డు సమీపంలోని రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ వద్ద బాలుడు “స్మోక్ బిస్కెట్లు”( లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ లేదా డ్రై ఐస్ కలిపిన బిస్కెట్లు) తింటుండగా అస్వస్థతకు గురయ్యాడు, వెంటనే తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే బాబుతో ఉన్నవారు కన్నడ భాషలో మాట్లాడటం మనం గమనించవచ్చు, అలాగే కొంత మంది ఈ వీడియోను పోస్టు చేస్తూ ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది అని రాసుకొచ్చారు. వీటి ఆధారంగా కన్నడ భాషలో తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన పలు కన్నడ మీడియా కథనాలు లభించాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, “కర్ణాటకలోని దావణగెరెలోని పీబీ రోడ్డు సమీపంలోని రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్‌లో 17 ఏప్రిల్ రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన ఒక స్టాల్ వద్ద బాలుడు “స్మోక్ బిస్కెట్లు”( లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ లేదా డ్రై ఐస్ కలిపిన బిస్కెట్లు) తింటుండగా అస్వస్థతకు గురయ్యాడు, తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్మోక్ బిస్కెట్లపై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు అధికారులు పొగ బిస్కెట్ల విక్రయాలను నిలిపివేసి స్టాల్ ను సీజ్ చేశారు. పిల్లలకు ఇలాంటి స్మోక్ బిస్కెట్లు ఇవ్వొద్దని హెచ్చరిస్తూ ఆ బాలుడి తల్లితండ్రులు ఒక ఆడియో సందేశం విడుదల చేశారు.” (కన్నడ నుండి తెలుగు అనువాదం)

డ్రై ఐస్, లిక్విడ్ నైట్రోజన్ అంటే ఏమిటి?

డ్రై ఐస్ అంటే ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ -మైనస్ 78.5 సెంటీగ్రేడ్ వద్ద ఘనస్థితిలో ఉంటుంది. ఇలా కార్బన్ డయాక్సైడ్ మార్చడాన్ని సబ్లిమేషన్ అంటారు. ఇలా ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను షిప్పింగ్ లో వినియోగిస్తారు. షిప్పింగ్ లో ఉత్పత్తులు పాడవకుండా భద్రపరచడం కోసం దీన్ని గడ్డకట్టే ఏజెంట్‌గా వినియోగిస్తారు.

లిక్విడ్ నైట్రోజన్ – మైనస్196 °C ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. లిక్విడ్ నైట్రోజన్ కూడా శీతలకరణిగా (గడ్డకట్టే ఏజెంట్‌)గా ఉత్పత్తులు పాడవకుండా భద్రపరచడం కోసం విస్తృతంగా వినియోగిస్తారు. ఆహార ఉత్పత్తుల ఇమ్మర్షన్, ఫ్రీజింగ్ మరియు రవాణా కోసం, అలాగే మెడికల్ ఉత్పత్తుల, రక్తం, పునరుత్పత్తి కణాలు ( వీర్యం మరియు గుడ్డు ) మరియు ఇతర జీవ నమూనాలు మరియు పదార్థాలను భద్రపరచడం కోసం వినియోగిస్తారు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), మరియు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, డ్రై ఐస్ మరియు లిక్విడ్ నైట్రోజన్ రెండూ ప్రాణాంతక పదార్థాలుగా వర్గీకరించబడ్డాయి, ఆహార వినియోగానికి తగినవి కావు.

అమెరికాకు చెందిన US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం డ్రై ఐస్ మరియు లిక్విడ్ నైట్రోజన్ చేత్తో పట్టుకోకుడదు. లిక్విడ్ నైట్రోజన్ మరియు డ్రై ఐస్‌ని నేరుగా తినకూడదు లేదా తాకకూడదు .డ్రై ఐస్ చేతితో పట్టుకుంటే చేతికి గాయాలు అవుతాయి. కాలిన గాయాల్లాగా అవి ఉంటాయి. ఇక ఈ డ్రై ఐస్‌ను తింటే నోరంతా కాలిపోతుంది. ఊపిరి కూడా ఆడక ఇబ్బంది పడతారు. ముట్టుకునేటప్పుడు చేతికి గ్లౌవ్స్ వేసుకోవడం చాలా అవసరం. అలాగే తగినంత వెంటిలేషన్ ఉన్నప్పుడే వాటిని ఓపెన్ చేయాలి. లేకపోతే డ్రై ఐస్  మరియు లిక్విడ్ నైట్రోజన్ వల్ల ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది, మన ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. డ్రై ఐస్ అనుకోకుండా తింటే అది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది, తీవ్రమైన అంతర్గత గాయాలకు కారణం అవుతుంది, నోటిలో లేదా జీర్ణవ్యవస్థలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన గ్యాస్ ఏర్పడుతుంది. కడుపుబ్బరం పొత్తి కడుపునొప్పి, వాంతులు, పేగులు చిల్లులు పడడం, పొట్టకు చిల్లులు పడడం వంటివి జరుగుతాయి. డ్రై ఐస్ మరియు లిక్విడ్ నైట్రోజన్ పొరపాటున నోటిలో పెట్టుకుంటే, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

మార్చి 2024లో హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఒక రెస్టారెంట్ ఆహారం అనంతరం ఐదుగురు కస్టమర్లకు పొరపాటున మౌత్ ఫ్రెషనర్‌కు బదులుగా డ్రై ఐస్‌ను అందించింది. ఇది తిని వారు అందరూ రక్త వాంతులు చేసుకున్నారు. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ ఘటన సంబంధించిన వార్త కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వీడియోలో కనిపిస్తున్న బాలుడు స్మోక్ బిస్కెట్లు తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యాడు, కానీ ఇప్పుడు చికిత్స తర్వాత బాగానే ఉన్నాడు.

Share.

About Author

Comments are closed.

scroll