ఏకాదశి ఉపవాసాలు హిందువులు ఎందుకు చేస్తారో పరిశోధించి అందులో దాగి ఉన్న సైన్స్ ని కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి ఇచ్చారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: హిందువులు చేసే ఏకాదశి ఉపవాసాల వెనుక దాగి ఉన్న సైన్స్ ను కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించింది.
ఫాక్ట్: ఆటోఫజి (Autophagy) ప్రక్రియ పనితీరు పై చేసిన పరిశోధనలకు జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒహ్సుమీకి 2016లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన హిందువుల ఉపవాసాలపై పరిశోధన చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఉపవాసం ఉండడం ద్వారా, ఆటోఫజి ప్రక్రియని వేగవంతం చేయవచ్చు అని అధ్యయనాలు చెప్తున్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా ఈ విషయం గురించి నోబెల్ బహుమతి అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించగా, 2016 సంవత్సరంలో వైద్య విభాగంలో జపాన్‌కు చెందిన యోషినోరి ఒహ్సుమీ అనే పరిశోధకుడికి ఆటోఫజి (Autophagy) పనితీరు మీద చేసిన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి లభించిందని తెలిసింది.
ఆటోఫజి అనగా జీవులలోని కణాలలో నిరంతరం జరిగే ఒక సహజమైన ప్రక్రియ. ఇందులో భాగంగా కణాలు తమలోని చెడిపోయిన లేదా అనవసర భాగాలను శుద్ధి చేయడం లేదా నిర్మూలించడం జరుగుతుంది. ఒహ్సుమీ కంటే ముందు ఈ ప్రక్రియ గురించి తెలిసినప్పటికీ, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగలేదు. 1990లలో ఆయన చేసిన పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియకు అవసరమయ్యే జన్యువులను(genes) గుర్తించాడు. ఇంకా ఆయన చేసిన ప్రయోగాల ద్వారా ఈ ప్రక్రియ జరిగే విధానం, కణాలు ఈ ప్రక్రియని ఉపయోగించుకొని వ్యాధులని, ఆహార కొరతని ఎలా ఎదుర్కొంటాయి అనే విషయాలని అధ్యయనం చేశాడు. ఈ ఆటోఫజి ప్రక్రియ సరైన రీతిలో జరగకుంటే అనేక వ్యాధులకు కారణమయ్యే అవకాశముందని కూడా ఆయన పరిశోధనలో వెల్లడించారు.
అయితే ఆయన హిందువుల ఏకాదశి ఉపవాసాలకు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఆయన ప్రచురించిన రిసెర్చ్ పేపర్లలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఎక్కడా కూడా హిందువులు చేసే ఉపవాసాలపైన తాను అధ్యయనం చేస్తున్నట్లు ప్రస్తావించలేదు.
అయితే ఉపవాసం ఉండడం ద్వారా, ఆటోఫజి ప్రక్రియని వేగవంతం చేయవచ్చు అని అధ్యయనాలు చెప్తున్నాయి. ఉపవాసం ఉన్న సమయంలో శరీరానికి తగిన పోషకాలు అందవు గనక కణాలు ఆటోఫజి ప్రక్రియ ద్వారా పునరుత్పత్తి అవుతాయి. అలాగే తక్కువ ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. అయితే, ఆటోఫజి ప్రక్రియ రోగాలను నియంత్రించగలదా అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నందున, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలనుకునేవారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
చివరిగా, ఆటోఫజి (Autophagy) పనితీరు మీద చేసిన పరిశోధనలకు జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒహ్సుమీకి నోబెల్ బహుమతి లభించింది, హిందువులు చేసే ఉపవాసాలకు కాదు.