Fake News, Telugu
 

పాకిస్థాన్‌ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని, గాంధీని ఉద్దేశిస్తూ జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభం ఎదురుకుంటున్న నేపథ్యంలో ఆ దేశానికి సహాయం అందించే విషయమై విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ మరియు గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘1947లోనే దివాళా తీసిన పాకిస్తాన్‌ను మహాత్మా గాంధీ 50 కోట్లు ఇప్పించి ఆదుకున్నారు.. అసలు ఆయన వల్లనే పాక్ ఏర్పడింది ఇది చారిత్రాత్మక సత్యం.. పాక్ దివాళా తీసిన ప్రతిసారి కాంగ్రెస్ ఏదో ఒకరూపంలో పాకిస్తాన్‌ను ఆదుకుంది..ఆ తప్పు మేం చేయం’ అని జయశంకర్ వ్యాఖ్యానించినట్టు ఈ పోస్టులో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: పాక్ దివాళా తీసిన ప్రతిసారి కాంగ్రెస్ ఏదో ఒకరూపంలో పాకిస్థాన్‌ను ఆదుకుంది. ఆ తప్పు మేం చేయం- పాకిస్థాన్‌కు సహాయంపై జయశంకర్.

ఫాక్ట్(నిజం): పాకిస్థాన్‌ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో మాట్లాడుతూ ‘ఈ విషయంలో నేరుగా స్పందించే అంత సంబంధాలు భారత్ – పాకిస్థాన్‌ మధ్య లేవని. ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనేది పాకిస్థాన్ పై ఆధారపడి ఉంటుందని’ మాత్రమే జయశంకర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీపై గానీ, గాంధీపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పోస్టులో జయశంకర్‌కు ఆపాదిస్తున్న వ్యాఖ్యలన్ని కల్పితాలే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంపై మాట్లాడారు. ఇదే ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌కు భారత్ సహాయం అందించే విషయంపై కూడా వ్యాఖ్యానించాడు.

ఈ ఇంటర్వ్యూలో ఆర్థిక సంక్షోభంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘పాకిస్థాన్ భవిష్యత్తు ఆ దేశం తీసుకునే చర్యలు, నిర్ణయాలపై నిర్ణయించబడుతుంది. ఎవరూ అకస్మాత్తుగా/కారణం లేకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితికి చేరుకోరు. ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలనేది పాకిస్థాన్ పై ఆధారపడి ఉంటుందని’ జయశంకర్ అన్నారు.

‘ఈ విషయంలో నేరుగా స్పందించే అంత సంబంధాలు భారత్ – పాకిస్థాన్‌ మధ్య లేవని. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సహాయం చేసిందని, ఐతే భారత్–శ్రీలంక మధ్య బంధం పాకిస్థాన్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైందని’ జయశంకర్‌ స్పష్టం చేశారు.

ఈ ఇంటర్వ్యూలో జయశంకర్ చేసిన వ్యాఖ్యలను చాలా ప్రధాన మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి, ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా జయశంకర్ పోస్టులో చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీపై గానీ, గాంధీపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఇంటర్వ్యూలోనే కాకుండా మరే ఇతర సందర్భంలో కూడా జయశంకర్ పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు చేసినట్టు మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.

పాకిస్థాన్‌కు గాంధీ 50 కోట్లు ఇప్పించి ఆదుకున్నారు?

ఇండియా – పాకిస్థాన్‌ విడిపోయిన సమయంలో జరిగిన ఆస్తుల విభజన అగ్రిమెంట్ ప్రకారం భారత ప్రభుత్వం  పాకిస్థాన్‌కు 75 కోట్లు చెల్లించాలి. ఇందులో విభజన సమయంలో 20 కోట్లు చెల్లించగా, మిగిలిన 55 కోట్లు మాత్రం భారత్ నిలిపేసింది. పాకిస్థాన్ కాశ్మీర్‌లోకి ప్రవేశించి, వివాదాన్ని సృష్టిస్తున్న కారణానికి భారత్ ఈ మొత్తాన్ని చెల్లించకుండా నిలిపేసింది. గాంధీ మాత్రం ఈ నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు.

ఐతే గాంధీ ఢిల్లీలో మత సామరస్యాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు మిగిలిన 55 కోట్లను చెల్లించింది. గాంధీ ఒత్తిడి మీదే భారత ప్రభుత్వం పాకిస్థాన్‌కు ఈ డబ్బు ఇచ్చిందనే వాదనలు ఉన్నాయి.

పోస్టులో దివాళా తీసిన పాకిస్థాన్‌కు గాంధీ 50 కోట్లు ఇప్పించాడు అన్న వాదన, పైన చెప్పిన అంశం నుండే సేకరించారు. ఐతే పోస్టులో చెప్తున్నటు జయశంకర్ పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు.

ఒకవేళ పోస్టులో చెప్తున్న వ్యాఖ్యలు నిజంగానే జయశంకర్ చేసి ఉంటే, మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది. కాని జయశంకర్ ఇలా అన్నట్టు మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. దీన్నిబట్టి, పోస్టులో చేస్తున్న వాదనలు పూర్తిగా కల్పితం అని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, పాకిస్థాన్‌ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్/గాంధీని ఉద్దేశిస్తూ జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll