Fake News, Telugu
 

గుజరాత్ చూళి జైన్ మందిరంలోని శిల్పాలని అయోధ్య రామ మందిరం పై చెక్కిన అద్భుత శిల్పాలుగా షేర్ చేస్తున్నారు

0

అయోధ్య రామ మందిర నిర్మాణంలో శిల్పుల నైపుణ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. వీడియోలో కనిపిస్తున్న అద్భుత శిల్పభవనం అయోధ్యలో నిర్మించిన రామ మందిరమని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్య రామ మందిరం పై చెక్కిన అద్భుత శిల్పాల దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): అద్భుత శిల్పకళలతో నిర్మించిన వీడియోలోని భవనం, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబడిన చూళి జైన్ మందిరం. గుజరాత్ రాష్ట్రంలోని హల్వాడ్-దంగాధార రహదారి  సమీపంలో ఈ చూళి జైన్ మందిరం నిర్మించబడింది. చూళి జైన్ మందిరాన్ని శ్రీ’ తరంగ్ విహార్ ధాం’ అని పిలుస్తారు. ఈ వీడియోకి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక యూసర్ తన ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. అద్భుత శిల్పకళలతో నిర్మించిన వీడియోలోని భవనం, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబడిన చూళి జైన్ మందిరమని ఆ యూసర్ తన పోస్టు వివరణలో తెలిపారు. ఈ వీడియోని ఇదే వివరణతో మరికొంత మంది యూసర్లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న మందిరానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతకగా, చూళి గ్రామంలో నిర్మించిన ఈ జైన్ మందిరాన్ని వర్ణిస్తూ ‘Doonited News’ తమ యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. పోస్టులో షేర్ చేసిన వీడియోలోని అవే శిల్పాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని హల్వాడ్-దంగాధార రహదారి  సమీపంలో ఈ  జైన్ మందిరాన్ని నిర్మించినట్టు తెలిసింది. చూళి గ్రామంలోని ఈ జైన్ మందిరాన్ని ‘శ్రీ తరంగ్ విహార్ ధాం’ అని పిలుస్తారు. ఈ మందిరానికి సంబంధించి యూట్యూబ్ లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో ‘శ్రీ తరంగ్ ధాం తీర్థ’ అనే హార్డింగ్ కనిపిస్తుంది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

‘శ్రీ తరంగ్ విహార్ ధాం’ మందిరం కోసం ‘గూగుల్ ఎర్త్’ లో వెతకగా, ఈ మందిరం గుజరాత్ రాష్ట్రంలోని చూళి గ్రమంలో ఉన్నట్టు స్పష్టంగా చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో లోని అవే శిల్పాల ఫోటోలు, గూగుల్ మాప్స్ లో చూళి జైన్ మందిరానికి సంబంధించినవి తెలిపారు.

అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల ఫోటోలను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు 31 మే 2021 నాడు పెట్టిన ట్వీట్ లో షేర్ చేసారు. ఈ ఫోటోలలో రామ మందిర నిర్మాణ పనుల ప్రక్రియలో ఇంకా పునాది రాళ్లు కూడా వేయనట్టు స్పష్టంగా తెలుస్తుంది. ‘India TV’ న్యూస్ సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో డిసెంబర్ 2021 నుండి అయోధ్య రామ మందిర రాతి పనులు మొదలవుతాయని తెలిపింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, గుజరాత్ చూళి జైన్ మందిరంలోని శిల్పాలని అయోధ్య రామ మందిరం పై చెక్కిన అద్భుత శిల్పాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll