Fake News, Telugu
 

ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నది శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వినందుకు కాదు, పోలీసుపై దాడి చేసినందుకు

0

మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి ర్యాలీపై రాళ్లు రువ్విన వ్యక్తిని(ముస్లిం) మధ్యప్రదేశ్ పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారంటూ, పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లో శ్రీ రామనవమి ర్యాలీపై రాళ్లు రువ్విన వ్యక్తిని (ముస్లిం) మధ్యప్రదేశ్ పోలీసులు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియో.

ఫాక్ట్: ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నది అతను పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు, శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్లు రువ్వినందుకు కాదు. పైగా పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఆ వ్యక్తి ముస్లిం కాదు. అతని పేరు దినేష్ ప్రజాపతి అని వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో జరిగిన ఊరేగింపులో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ). అంతేకాదు, పోలీసులు వీరిపై చర్యలు తీసుకున్నట్టు కూడా వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

పోస్టులో షేర్ చేసిన వీడియోకు శ్రీరామనవమి రోజు రాళ్లు రువ్విన ఘటనకు ఎటువంటి సంబంధంలేదు.  అంతకుముందు 09 ఏప్రిల్ 2022న ఇండోర్‌లోని ఏరోడ్రోమ్ ప్రాంతంలో వాహనం ఢీకొట్టిన ఘటనకు సంబంధించి  దినేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్ కొట్టడంతో అతను తిరిగి కానిస్టేబుల్‌పై దాడి చేసాడు. దినేష్ ప్రజాపతి పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఐతే పోలీసును కొట్టిన వీడియో వైరల్ అవడంతో, పోలీసులు అతనిని పట్టుకొని అతను ఎక్కడైతే కానిస్టేబుల్‌ను కొట్టాడో, అదే ప్రాంతంలో అతనిని కొట్టుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పైగా పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఆ వ్యక్తి ముస్లిం కాదు, అతని పేరును బట్టి (దినేష్ ప్రజాపతి) అతను హిందూ అని అర్ధమవుతుంది.

చివరగా, ఈ వీడియోలో పోలీసులు ఒక వ్యక్తిని కొట్టుకుంటూ తీసుకెళ్తున్నది శ్రీరామనవమి ఊరేగింపుపై రాళ్ళు రువ్వినందుకు కాదు, పోలీసుపై దాడి చేసినందుకు.

Share.

About Author

Comments are closed.

scroll