Fake News, Telugu
 

మార్ఫ్ చేసిన ఫోటోని ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు

0

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యం అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. తెరాస కార్యకర్తలతో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో, “కేసీఆర్ ఈ దొంగ ధర్నాలు ఆపి వడ్లు కొను” అని రాసి ఉన్న ప్లకార్డు జీవన్ రెడ్డి పట్టుకొని నిరసన తెలిపిన దృశ్యాన్ని మనం ఈ ఫోటోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యం.

ఫాక్ట్: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో జీవన్ రెడ్డి చేతిలో కనిపిస్తున్న ప్లకార్డుపై, “రైతుల జీవితాలతో రాజకీయమా?.. సిగ్గు సిగ్గు”, అని రాసి ఉంది. తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు 11 ఏప్రిల్ 2022 నాడు ఢిల్లీలో మహా ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జీవన్ రెడ్డి పట్టుకున్న ప్లకార్డుని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో ఇలా తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటో కోసం తెరాస నాయకుడు మరియు ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి అధికారిక సోషల్ మీడియా పేజీలలో వెతికితే, ప్లకార్డు పట్టుకొని నిరసన చేపట్టిన ఇదే ఫోటోని జీవన్ రెడ్డి 11 ఏప్రిల్ 2022 నాడు తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. జీవన్ రెడ్డి ఈ ఫోటోతో సహా మరో రెండు ఫోటోలని షేర్ చేస్తూ, “తెలంగాణలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలో తలపెట్టిన టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది”, అని తెలిపారు.

అయితే, అసలు ఫోటోలో జీవన్ రెడ్డి చేతిలో కనిపిస్తున్న ప్లకార్డుపై, “రైతుల జీవితాలతో రాజకీయమా?.. సిగ్గు సిగ్గు”, అని రాసి ఉంది. కేసీఆర్‌ దొంగ ధర్నాలు ఆపి ధాన్యం కొనాలని ఈ ప్లకార్డుపై రాసి లేదు.

కేసీఆర్ ఆధ్వర్యంలో తెరాస నాయకులు ఢిల్లీలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కొంతమంది నెటిజన్లు జీవన్ రెడ్డి పోస్ట్ చేసిన అసలు ఫోటోని షేర్ చేస్తూ, ఈ ధర్నా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ సొంత పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టు తెలుపుతున్నారు. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.  తెరాస నాయకులు ఈ నిరసన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టారు, తమ పార్టీకి వ్యతిరేకంగా కాదు.

చివరగా, మార్ఫ్ చేసిన ఫోటోని ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్మూరు ఎమ్మేల్యే జీవన్ రెడ్డి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన దృశ్యమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll